ఆదిలాబాద్: రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో మోసం

ఆదిలాబాద్: రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో మోసం
  •     ఏడాదిలోనే డబుల్ వస్తాయంటూ నమ్మించిన నిందితులు
  •     పలువురి నుంచి రూ. 13.50 కోట్లు వసూలు
  •     ఇద్దరిని అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, సంవత్సరంలో రెట్టింపు లాభాలు అంటూ ఆశచూపి పలువురి వద్ద రూ. కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని ఆదిలాబాద్​జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో వెల్లడించారు. ఆదిలాబాద్​పట్టణంలోని మోచీగల్లికి చెందిన బండారి రాకేశ్, బేలా మండలం సాంగ్డి గ్రామానికి చెందిన కుంటవార్ అచ్యుత్​రెడ్డిలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. వీరిని నమ్మి ఆదిలాబాద్​పట్టణంలోని శాంతినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సాయిని ప్రవీణ్ కుమార్ మొత్తం రూ.1.70 కోట్లు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత లాభం పేరుతో కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వగా, మిగిలిన డబ్బులపై కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ప్రవీణ్ కుమార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. నిందితులు మొత్తం 16 మంది నుంచి రూ. 13.50 కోట్ల వరకు వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఈ డబ్బులతో అచ్యుత్​రెడ్డి బెంజ్, పార్చ్యూనర్​కార్లతో పాటు ఏడు చోట్ల ఆస్తులు, రాకేశ్​నాలుగు చోట్ల ప్లాట్లు, థార్ కొనుగోలు చేయగా మిగిలిన డబ్బులతో జల్సా చేసినట్లు గుర్తించారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కార్లు, సెల్ ఫోన్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఆస్తుల విలువ మొత్తం రూ.7 నుంచి 8 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు చంద్రకాంత్​రెడ్డి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్​రెడ్డి, సీఐ సునీల్ కుమార్, ఎస్సై నాగనాథ్​పాల్గొన్నారు.