మేయర్లు, కార్పొరేటర్ల అధికారాలు లాక్కుంటారా?..: అక్బరుద్దీన్ ఒవైసీ

మేయర్లు, కార్పొరేటర్ల అధికారాలు లాక్కుంటారా?..: అక్బరుద్దీన్ ఒవైసీ
  • కార్పొరేషన్లలో 11 ఏండ్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన పెడ్తరా?: అక్బరుద్దీన్ ఒవైసీ
  • క్యూర్ బిల్లుతో ప్రజలపై ఆస్తి పన్నుల భారం పెరుగుతుందని ఆవేదన 
  • అసెంబ్లీలో క్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లు –2026 పై చర్చ

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికైన పాలక మండలి గడువు ఐదేండ్లు మాత్రమే ఉంటే, స్పెషల్ ఆఫీసర్ల పాలనను మూడేండ్లన్నర నుంచి గరిష్టంగా 11 ఏండ్ల దాకా పొడిగించేలా నిబంధన తేవడం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ (క్యూర్) బిల్లు– 2026పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

బిల్లులోని షెడ్యూల్ 2, క్లాజ్ 77 స్థానిక సంస్థల ఎన్నికల విధానాన్ని కాలరాసేలా ఉందని, ఆ నిబంధనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కర్నాటకలోని గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ యాక్ట్ నమూనా ఆధారంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు. సీఎం చైర్మన్‌‌‌‌‌‌‌‌గా అపెక్స్ కౌన్సిల్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసి, ఎన్నికైన మేయర్లు, కార్పొరేటర్ల అధికారాలను పూర్తిగా లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. విధానపరమైన, పాలనా నిర్ణయాలన్ని ఈ రెండు కమిటీలే తీసుకుంటే ఇక కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని నిలదీశారు. బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ గడువు ఇప్పటికే ముగిసిందని, గడువును పొడిగించి బిల్లును అసెంబ్లీ సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

క్యూర్ బిల్లుతో ప్రాపర్టీ టాక్స్ బాదుడు...

కొత్త పన్నుల విధానంలో యాన్యువల్ రెంటల్ వ్యాల్యూ (ఏఆర్‌‌‌‌‌‌‌‌వీ) పద్ధతికి బదులుగా క్యాపిటల్ వ్యాల్యూ సిస్టమ్ (సీవీఎస్) తేవడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ భవనాలకు 0.10 నుంచి 0.50 శాతం, కమర్షియల్ భవనాలకు 0.20 నుంచి 2 శాతం దాకా పన్ను విధిస్తే.. అధిక పన్నుల భారం పడుతుందన్నారు. ఉల్లంఘనలపై 300 శాతం పెనాల్టీలు, ఏటా 20 శాతం పన్ను పెంచుకునే క్లాజ్ 78 సరికాదన్నారు.

భవనంలో ఏ చిన్న ఉల్లంఘన ఉన్నా మొత్తం బిల్డింగ్‌‌‌‌‌‌‌‌కు నీరు, కరెంట్ కట్ చేసే క్లాజ్ 167 వల్ల అద్దెదారులు నష్టపోతారని చెప్పారు. మురుగునీటి పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు లేనిచోట కూడా సీవరేజ్ చార్జీలు వసూలు చేయడమే కాకుండా, క్లాజ్ 237 ద్వారా ఏటా 5% చొప్పున ఐదేళ్లలో 27.6% ఆటోమేటిక్ పెంపు విధించడం అన్యాయమన్నారు. చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 78 వేల మంది టూరిస్టులు వస్తున్నా పబ్లిక్ టాయిలెట్లు లేవని, లాడ్ బజార్, పెడెస్ట్రియన్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు. 

ఎమ్మెల్యేలతో సమన్వయం లేకుండా గ్లోబల్ సిటీ ఎలా?: రాజాసింగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ సిటీగా మార్చాలన్న ఆలోచన మంచిదే అయినా, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో సీఎం సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. రోడ్ల వెడల్పు, డ్రైనేజీ లైన్లు, తాగునీటి పైప్‌‌‌‌‌‌‌‌లైన్ల సామర్థ్యం చూడకుండానే అధికారులు అడ్డగోలుగా హైరైజ్ భవనాలకు అనుమతులు ఇస్తున్నారని, దీంతో డ్రైనేజీలు రోడ్లపై పొంగిపొర్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాలు, ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్ కబ్జాలపై ఎమ్మెల్యేలు లేఖలు రాసినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఎమ్మెల్యేలకు కనీస విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కమర్షియల్ బిల్డింగుల్లో మహిళా టాయిలెట్లు తప్పనిసరి: పద్మావతి రెడ్డి

సిటీలో కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు, కమర్షియల్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ల్లో  మహిళల కోసం ప్రత్యేక పబ్లిక్ టాయిలెట్లను తప్పనిసరి చేస్తూ భవన నిర్మాణ అనుమతుల్లోనే నిబంధన చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోరారు. బయటకు వచ్చే మహిళలు టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రతి అరకిలోమీటరుకు శాస్త్రీయ వ్యర్థాల సేకరణ కేంద్రాలు నెలకొల్పాలని, పరిశుభ్రతపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని సూచించారు. క్యూర్ బిల్లు హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు శ్రీగణేష్, మల్‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగారెడ్డి సూచించారు.