- హైదరాబాద్ శివారులోని దుండిగల్, మెదక్ జిల్లా మక్తలక్ష్మాపూర్ లో ఘటనలు
పెద్దశంకరంపేట, వెలుగు : కుటుంబ గొడవలతో తల్లి ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయాన్ని తట్టుకోలేక కొడుకు సైతం సూసైడ్ చేసుకున్నాడు. తల్లి హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో చనిపోగా, కొడుకు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధి మక్తలక్ష్మాపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దశంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మక్తలక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నాగదర్ శివయ్య, బేతమ్మ (45) దంపతులు హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో ఉంటూ వాచ్ మెన్లుగా పనిచేస్తున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన బేతమ్మ దుండిగల్ లో ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేని ఆమె కొడుకు నాగదర్ ప్రవీణ్ (21) హైదరాబాద్ నుంచి సొంతూరైన మక్త లక్ష్మాపూర్‌కు వచ్చి కోలపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శివయ్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.
