- డిప్యూటీ సీఎం ప్రకటనతో రిజర్వాయర్ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు దిశగా అడుగులు?
- నాలుగేండ్ల కిందటే సింగరేణి ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే పూర్తి
- రూ.1,800 కోట్లతో 200 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక
సిద్దిపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు నాలుగేండ్ల కిందట సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ 200 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రాథమిక సర్వే నిర్వహించి, సుమారు రూ.1,800 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ ముందుకు పడకుండా ప్రాథమిక దశలోనే నిలిచిపోయింది. తాజాగా డిప్యూటీ సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
గతంలో ఇలా..
18 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగేండ్ల కింద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం అనువైన ప్రాంతంగా గుర్తించింది. ఇందులో భాగంగా రెండు దశల్లో, ఒక్కో విడతకు 100 మెగావాట్ల చొప్పున మొత్తం 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో భాగంగా పంప్ హౌజ్ సమీపంలోని వంద ఎకరాల్లో దాదాపు రూ.900 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే లోయర్ మానేర్ డ్యామ్ తరహాలోనే మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రావచ్చుననే అనుమానంతో అధికారులు ఆనాడు సర్వే పనులను కొంతవరకు గోప్యంగా నిర్వహించారు. అయినా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో అనుసరిస్తున్న కొన్ని నిబంధనలు, ప్రత్యేక పథకాల విధివిధానాలు మారితే ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతం కావడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌గా దీన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన అప్పట్లో ఉన్నప్పటికీ అది కాస్తా పెండింగ్‌లో పడింది.
డిప్యూటీ సీఎం ప్రకటనతో కదలిక...
ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ ప్రాజెక్టుపై మళ్లీ కదలిక వచ్చింది. గత నాలుగేండ్లుగా వివిధ కారణాలరీత్యా పెండింగ్‌లో పడిపోయిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన మళ్లీ జీవం పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చొరవ, కేంద్ర ప్రభుత్వ విధానపరమైన సహాయ సహకారాలతో ఈ భారీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
