అధికారం పోయినా అహంకారం తగ్గలే..ప్రజల దృష్టిని మరల్చేందుకే ఫాంహౌస్ కుట్రలు

అధికారం పోయినా అహంకారం తగ్గలే..ప్రజల దృష్టిని మరల్చేందుకే ఫాంహౌస్ కుట్రలు
  • బీఆర్ఎస్ నేతలపై సభలోసీఎం రేవంత్ ఫైర్
  • టీ షర్టులు వేసుకున్నంత మాత్రాన యువకులైపోరు
  • వాళ్ల పిల్లలు సింగపూర్, అమెరికాలో చదువుతరు
  • ‘పాలు అమ్మిన, పూలు అమ్మిన’ 
  • యూనివర్శిటీలో 400 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్
  • పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించొద్దా..?

హైదరాబాద్, వెలుగు: ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్‌‌ఎస్ నేతలు ఫామ్‌‌హౌస్ కుట్రలు చేస్తున్నారని, అధికారం పోయినా వారి అహంకారం తగ్గలేదని సీఎం రేవంత్‌‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘టీషర్టు వేసుకున్నంత మాత్రాన యువకులు అయిపోరు.. కొందరు పుట్టుకతోనే వృద్ధులని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. అహంకారంతో విర్రవీగిన పది తలల రావణాసురుడికి కూడా రాముడి చేతిలో చావు తప్పలేదు’’ అని చురకలంటించారు. 

మాసబ్‌‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్న హరీశ్‌‌రావు.. ఇప్పుడు పేద పిల్లలకు ఆధునిక సాంకేతికత అందించే పాలిటెక్నిక్ సంస్కరణలను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు.   పేదల బిడ్డలు గొర్రెలు, బర్రెలు, చేపలు పట్టుకునే కులవృత్తుల్లోనే మగ్గిపోవాలని కుట్రలు పన్నిన బీఆర్‌‌ఎస్ అగ్రనేతలు..  హరీశ్‌‌రావు ఇద్దరు పిల్లలను సింగపూర్‌‌లో, కేటీఆర్ ఇద్దరు పిల్లలను అమెరికాలో, కవిత ఇద్దరు పిల్లలను అమెరికాలో ఎందుకు చదివిస్తున్నారని  ప్రశ్నించారు. 

‘‘కేటీఆర్ పుట్టిపెరిగింది ప్రభుత్వ బంగ్లాల్లో.. చదువుకున్నది గుంటూరులో ఆయనకు పేదరికం అంటే బెంజ్ కార్లలో ఊళ్లకొచ్చి చూసే పిక్నిక్. నేను కొండారెడ్డిపల్లి, తాండూరు, వనపర్తి సర్కారు బడుల్లో చదువుకుని ఏవీ కాలేజీలో బీఏ పాసైన పక్కా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని కాబట్టే పేదల బాధలు తెలుసు’’ అని సీఎం స్పష్టం చేశారు. ఎకరాకు కోటి రూపాయలు సంపాదించానని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ఆ విద్యను కాంగ్రెస్ పంచిన 35 లక్షల ఎకరాల భూములున్న దళిత, గిరిజన రైతులకు నేర్పించాలని ఎద్దేవా చేశారు.  

అధికారం కోల్పోయి విచక్షణారాహిత్యంతో కానిస్టేబుల్ గొంతు పిసికే స్థాయికి దిగజారిన బీఆర్‌‌ఎస్ నేతల దుర్మార్గాన్ని ప్రజలు తిప్పికొడతారని, ఎన్ని కుట్రలు చేసినా పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన విద్యా విప్లవాన్ని ఆపలేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలకు ఎలాంటి బాధ లేదని, కేసీఆర్‌‌, హరీశ్‌‌రావు, కేటీఆర్‌‌లకే బాధ ఉందని అన్నారు. ప్రజలు వారి తిక్క కుదిరిందని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పాలు అమ్మిన, పూలు అమ్మినా అన్న యూనివర్శిటీ లో 400 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉందని పరోక్షంగా మల్లారెడ్డిని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. 

హరీశ్ బంగారు గొలుసు దాసుకుండు 

"మొన్న అసెంబ్లీ గేటు దగ్గర ధర్నాలో పోలీసుల ముందే హరీష్ రావు టీషర్టు ఇప్పగానే.. మెడలోని బంగారు గొలుసును మాత్రం ఎంబడే అత్యంత జాగ్రత్తగా జేబులో దాచుకున్నారు. ఎందుకు దాచుకున్నాడు? వెనకాల బావమరిది కేటిఆర్ ఉన్నాడు.. ఆయన  కంటబడితే మాయమైపోతుందని జేబులో దాచుకున్నాడు? సొంత సొమ్ముపై అంత శ్రద్ధ ఉన్నోళ్లు, ప్రజల సొమ్ము రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి, లక్ష కోట్లు గోదావరిలో పోసి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ఎందుకు మార్చారు?" అని విమర్శించారు. 

కానిస్టేబుల్ గొంతు పిసికారు

"పోలీస్ కానిస్టేబుల్ గొంతు పట్టి పిసికినప్పుడు వాళ్ల  ముఖంలో ఉన్న ఆక్రోశం చూశారా? ఆ కానిస్టేబుల్ ముఖంలో నా ముఖం కనిపించి ఆ కోపమంతా అతనిపై తీర్చుకున్నట్లున్నారని ఎమ్మెల్యేలు శంకరన్న, ఆది శ్రీనివాస్ నాతో అన్నారు. బీఆర్ఎస్ లీడర్లకు అధికారం పోయినా అహంకారం పోలేదు" అని ధ్వజమెత్తారు.