మా హక్కులకు భంగం కలిగించారు.. మహిళా, NHRCకి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కంప్లైంట్

మా హక్కులకు భంగం కలిగించారు.. మహిళా, NHRCకి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కంప్లైంట్
  • మమ్మల్ని అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: సబితా ఇంద్రారెడ్డి
  • మాపైకి ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నరు: సునీత లక్ష్మారెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ లోనే తమ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆరోపించింది. తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకొని, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించారని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్ డబ్ల్యూసీ), జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌‌‌(ఎన్​హెచ్ ఆర్​సీ)కు వారు ఫిర్యాదు చేశారు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి.. ఎన్ డబ్ల్యూసీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ విజయ రహత్కర్‌‌‌‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌‌‌ సభ్యురాలు విజయ భారతిని కలిసి కంప్లైంట్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కేసీఆర్‌‌‌‌కు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.

కుట్రలో భాగంగానే..

అమ్మపై వ్యాఖ్యలకు బాధ కలిగిందన్న వారు.. అక్కా, చెల్లెళ్లకు జరిగిన అవమానంపై స్పందించరా? అని స్పీకర్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే సబితా వ్యాఖ్యలు చేశారు. కమిషన్​లలో ఫిర్యాదు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కుట్రలో భాగంగానే  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు రాకుండా చేశారని ఆరోపించారు. తమను అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని సబిత ప్రశ్నించారు. అసెంబ్లీ వంటి పవిత్ర ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. 

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ కూడా నమోదు చేయలేదని.. మరోవైపు తమపైనే కేసులు నమోదు చేయడం రాజకీయ నాటకమని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతోనే ఢిల్లీకి వచ్చామని తెలిపారు. తమపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును పూర్తి వివరాలతో జాతీయ కమిషన్లకు వివరించామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. 

‘‘ప్రజా సమస్యలపై మా గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేయించి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరం. మాకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పీకర్‌‌‌‌ స్పందించి ఉంటే ఆయనకు చేతులెత్తి నమస్కరించేవాళ్లం’ అని సునీత పేర్కొన్నారు.