టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో ఇప్పుడు ఓ కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. సినిమాల్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్న సామ్.. ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి త్వరలోనే తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతోంది. అయితే ఈ ప్రెగ్నెన్సీ తమకు ముందే ప్లాన్ చేసుకున్నది కాదని సమంత చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గతేడాది డిసెంబర్ ( 2025 )లో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో ఆధ్యాత్మిక వాతావరణంలో రాజ్ నిడిమోరును వివాహమాడిన సమంత, జూన్ నెలలో 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ మీట్ వేదికగా తను గర్భవతిననే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీపై స్పందిస్తూ.. ' ఓ దశలో తామిద్దరం పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా పర్లేదనే ఒక నిర్ణయానికి వచ్చాం. నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. రాజ్ కూడా అలాగే ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ వార్త మాకు ఒక అద్భుతమైన సర్ ప్రైజ్' అని నవ్వుతూ పంచుకున్నారు.
విశేషమేమిటంటే.. 'మా ఇంటి బంగారం' చిత్రంలోని 'తస్సాదియ్యా' మాస్ సాంగ్ షూటింగ్ మొదటి రోజునే సమంత తాను గర్భవతిననే విషయాన్ని తెలుసుకున్నారు. కొద్దిపాటి అనారోగ్యం, మార్నింగ్ సిక్ నెస్ ఉన్నప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా ఆ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులను పూర్తి చేశారు. ఆ తర్వాత చేయాల్సిన అవుట్‌డోర్ యాక్షన్, కార్ ఛేజింగ్ సీన్స్ సమయంలో దర్శకురాలు, తన ఆప్తమిత్రురాలు నందినీ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సమంతకి ఎలాంటి ఆయాసం కలగకుండా చిత్రీకరణ పూర్తి చేశారు.
గతంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి వెబ్ సిరీస్‌ల సమయం నుంచే రాజ్, సమంతల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. జీవితంలో ఎన్నో సవాళ్లను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని నిలబడిన సమంత, ఇప్పుడు మాతృత్వానికి సిద్ధమయ్యారు. 'పిల్లలు పుడితే జీవితం పూర్తిగా మారిపోతుందని అందరూ చెప్తున్నారు, ఆ కొత్త మార్పును ఆస్వాదించడానికి నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను' అని సమంత ఎంతో ఆనందంగా తెలిపారు. అభిమానులు కూడా తమ ప్రియమైన నటికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
