హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ 2026 లో హైదరాబాద్‌కు చెందిన వెలుగు దినపత్రిక ఫోటోగ్రాఫర్ రావుట్ల శ్యాం కుమార్ విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు.
మై ఇండియా: 80 ఇయర్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్’ అనే జాతీయ థీమ్‌తో ఈ ఫోటోగ్రఫీ పోటీని నిర్వహించారు. దేశవ్యాప్తంగా వందలాది మంది ఫోటోగ్రాఫర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఫోటోలను సమర్పించారు.
ఈ పోటీలో రావుట్ల శ్యాం కుమార్ తీసిన ‘భారత జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ ఫోటో న్యాయ నిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుంది. దేశభక్తి, ప్రజల ఉత్సాహం, భారతీయుల ఐక్యతను ఒకే ఫ్రేమ్‌లో అద్భుతంగా ఆవిష్కరించినందుకు ఆయనకు ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’ లభించింది.
అక్టోబర్ 2న అవార్డు ప్రదానం
జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన రావుట్ల శ్యాం కుమార్‌కు అకాడమీ ప్రతినిధులు ప్రత్యేక ప్రశంసా పత్రంతో పాటు ‘ఇండియన్ హెరిటేజ్ అండ్ పేట్రియాటిజమ్ అవార్డు’, నగదు బహుమతిని అందజేయనున్నారు. విజయవాడలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును సాధించిన శ్యాం కుమార్‌ను పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లు, పత్రికా ప్రతినిధులు అభినందించారు.
