పెద్దపల్లి: ఎన్టీపీసీ రామగుండంలోని కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాకా వెంకటస్వామి కాలం నుంచి కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుదీప్ సింగ్‌ను కూడా కలిసినట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీకి చెందిన ఐఎన్‌టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఐఎన్‌టీయూసీ నాయకుడు బాబర్ సలీం పాషా నివాసంలో ఎంపీ వంశీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు.
ఎన్టీపీసీ స్టేజ్-2లో భాగంగా మోగిల్‌పహాడ్, రాజాపూర్ గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని కోరినట్లు వంశీకృష్ణ తెలిపారు. యాష్‌పాండ్ కోసం సుమారు 600 ఎకరాల భూమిని కోల్పోతున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఎన్టీపీసీని బి గ్రేడ్ నుంచి అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. స్థానికులకు న్యాయం జరగకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దళితుల వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నాయని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నా బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.అయోధ్య నిధుల విషయంలోనూ బీజేపీ నాయకులు మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమాలు చేపడుతున్నాయని విమర్శించారు.కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు.
రామగుండం ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నట్లు ఎంపీ తెలిపారు. రైల్వే అధికారులను ఎప్పటికప్పుడు కలిసి ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రామగుండం విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
