ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ

జగిత్యాల జిల్లా: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. మేళతాళాలతో ఆలయా అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో శ్రీనివాస్ తీర్థ ప్రసాదం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై ఎంపీ వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడారు.

ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలను వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వచ్చే పుష్కరాల వరకు ఆలయాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.

ధర్మపురి,కోటిలింగాల,రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే వచ్చే పుష్కరాలను ప్రయాగ్ రాజ్ కుంభ మేళ తరహాలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరానని తెలిపారు.

గత ప్రభుత్వం ఆలయాలను పట్టించుకోలేదని, దేవుడి పేరుతో బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందే తప్ప ఆలయాల అభివృద్ధి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరంలో హుండీ డబ్బులు చోరీ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ ఎద్దేవా చేశారు.