తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ ఔటర్‌లో మరోసారి గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడం కలకలం రేపుతోంది. పారాదీప్ నుంచి బారామతికి ఫెర్టిలైజర్స్ తరలిస్తున్న 78 భోగీల గూడ్స్ ట్రైన్‌లోని 8 భోగీలు కొవ్వూరు రైల్వే స్టేషన్ ఔటర్‌లోని నాలుగో లైన్ వద్ద పట్టాలు తప్పినట్లు సమాచారం.
ఇదే వారంలో ఇదే ట్రాక్ పరిధిలో రెండోసారి రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా ఒకే ప్రాంతంలో రైళ్లు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే ఘటన పాసింజర్ రైలు లేదా వందే భారత్ రైలుకు ఎదురైతే పరిస్థితి ఎలా ఉండేదన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ట్రాక్‌లో సాంకేతిక లోపమా ? నిర్వహణలో నిర్లక్ష్యమా ? లేక మరేదైనా కారణమా ? అనే అంశాలపై రైల్వే అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మరోవైపు.. ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను రైల్వే పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకే వారంలో ఒకే ప్రాంతంలో రెండుసార్లు రైళ్లు పట్టాలు తప్పడానికి అసలు కారణాలేంటి ? రైల్వే ట్రాక్ భద్రతపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? మీడియాను ఎందుకు అడ్డుకున్నారు ? అనే ప్రశ్నలకు రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఘటనపై సమగ్ర సాంకేతిక విచారణ చేపట్టి వాస్తవ కారణాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
