‘బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 11, 2026న) ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వరల్డ్ వైడ్గా థియేటర్లలో విడుదలైంది.
లవ్, రిలేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఎంతవరకు ఆకట్టుకుంది? ఆనంద్ దేవరకొండ–వైష్ణవి చైతన్య జోడీ మరోసారి తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేశారా? డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ ప్రేమకథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..
కథేంటంటే:
‘#90s - ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ప్రపంచం నుంచే ఈ కథ మొదలవుతుంది. ఆ వెబ్ సిరీస్‌లోని కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) వనపర్తిలో డిగ్రీ పూర్తి చేసి సినిమా దర్శకుడు కావాలని షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటాడు. సినీ ఇండస్ట్రీ అంటేనే రిస్క్ అని భావించిన తండ్రి చంద్రశేఖర్ (శివాజీ) ఆదిత్యని చదువుల కోసం లండన్ పంపిస్తాడు. అక్కడ లండన్‌లో దిగాక కూడా ఆదిత్య మనసు నిండా సినిమా ఆలోచనలే ఉంటాయి.
తాను చేరిన యూనివర్సిటీలోనే తెలుగమ్మాయైన కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా తొలి రోజే ఒకరికొకరు దగ్గరయ్యేలా చేస్తుంది. వేర్వేరు నేపథ్యాలకు చెందిన ఆ ఇద్దరి మధ్య బంధం సహజీవనం వరకు వెళ్తుంది. ఆ ప్రేమ ఎటు దారి తీసింది? ఆదిత్య డైరెక్టర్ అయ్యాడా? పెళ్లి చేసుకోవాలన్న తల్లిదండ్రుల ఒత్తిడికి కడలి తలొంచిందా? జీవితంలో ఇంకా స్థిరపడని ఆదిత్య ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
'#90s' యూనివర్స్‌కు కొనసాగింపుగా అందులో చిన్న కొడుకు పాత్ర చుట్టూ స్టోరీని రూపొందించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. చాలా మంచి ఆలోచన ఇది. ప్రస్తుత జనరేషన్ యూత్ జీవన శైలిని, వాళ్ల మధ్య బంధాలను, గందరగోళాలను, కుటుంబాల నుంచి, సమాజం నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అద్దం పట్టేలా ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్ని మలయాళం సినిమాల్లో పెద్దగా కథ ఉండదు కానీ సన్నివేశాల్లో మ్యాజిక్ ఉంటుంది. దర్శకుడు ఆదిత్య ఈ సినిమా కోసం అదే దారిని అనుసరించాడు.
ఆదిత్య షార్ట్ ఫిలిమ్స్, స్నేహితులు, ఫ్యామిలీ మూమెంట్స్‌తో కథ చాలా కూల్‌గా మొదలవుతుంది. లండన్‌కి షిఫ్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రేమకథలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఆసక్తి కలిగిస్తుంది. ఈ ప్రేమకథ చాలా మోడ్రన్‌గా, రియాలిస్టిక్‌గా నడుస్తుంది. ఫస్టాఫ్ లో అమ్మాయిలకు సొంత ఇంటి నుంచే ఎదురయ్యే ఒత్తిళ్లు, మరోవైపు మంచి నవ్వులు పంచే సన్నివేశాలు మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్‌లో ప్రేమకథ మెల్లమెల్లగా బాధ్యతలు, కెరీర్ భయాల చుట్టూ నడుస్తుంది. అబ్బాయిలు కెరీర్ పరంగా, అమ్మాయిలు బయోలాజికల్ మరియు మెంటల్ పరంగా ఎదుర్కొంటున్న స్ట్రెస్ వంటి అంశాలను ప్రస్తావించిన తీరు బావుంది.
అయితే, లివిన్ రిలేషన్ అనేది ఈ సినిమా ప్రధాన కథ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా డైరెక్టర్ ఆదిత్య తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారికే కాకుండా కుటుంబానికి దూరంగా ఉండే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఆదిత్య సక్సెస్ అయ్యాడు. ఇక ‘90s’ సిరీస్ ఫ్యామిలీ స్టోరీ అయితే, ఇదొక లవ్ స్టోరీ.
నటీనటుల నటన:
'బేబీ' సినిమాతో కుర్రకారును హృదయాలను కొల్లగొట్టిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ తెరపై మరోసారి చూడముచ్చటగా ఉంది. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో అమాయకత్వం నిండిన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. ప్రతీ సన్నివేశంలోనూ అతని సహజమైన నటన, భయం, కెరీర్ పట్ల ఉన్న బాధ్యత ఆకట్టుకుంటాయి.
ఆనంద్ నుంచి ఇలాంటి సినిమాలు వస్తే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని మరోసారి నిజం చేశాడు. ఇక 'బేబీ' తర్వాత అంతకుమించిన కడలి పాత్రలో వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది. ఆమె మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తూనే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది.
తండ్రీకొడుకుల ఎమోషన్‌లో శివాజీ, వాసుకిల పాత్రలు పరిమితంగానే ఉన్నా సినిమాపై బలమైన ప్రభావం చూపించాయి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ హీరో స్నేహితుడిగా నవ్విస్తూనే మంచి నటన కనబరిచాడు.
టెక్నికల్‌గా:
హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫీల్‌గుడ్ వైబ్ క్రియేట్ చేశాయి. అజీమ్ మహమ్మద్ విజువల్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. లండన్ లొకేషన్స్ ప్రేమకథకి కలర్‌ఫుల్ టోన్ యాడ్ చేశాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. డైరెక్టర్ ఆదిత్య హాసన్ స్క్రీన్ ప్లే మరోసారి మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా తాను రాసిన క్యాచీ డైలాగ్స్తో ఆకట్టుకున్నాడు.
