- సర్వే నంబర్ 325లో ఆ 45 ఎకరాలను గుర్తిస్తం
- భూ ఆక్రమణలపై చర్చకు అసెంబ్లీకి రావాలె
- హరీశ్ మామ కబ్జాలపై తెరవెనక స్టేటస్ కో
- పద్మాలయ, ల్యాంకో హిల్స్‌పై సెటిల్‌మెంట్లు
- ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్
న్యూఢిల్లీ, వెలుగు: ఎర్రవల్లిలో ఆక్రమణలను తేల్చి అక్కడ శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో రెండు గ్రామాల మధ్య ఉన్న వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారని ఫైర్ అయ్యారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల్లో దాదాపు 345 ఎకరాలను అధికారులు గుర్తించారని, మిగిలిన భూమి చెరువులు, ఇతర రూపాల్లో ఉందని, సర్వే జరుగుతోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో సీఎం మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ బుద్ధి మార్చుకుని ఆక్రమణలు మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ కబ్జా ఫైల్స్ ఇంకా ఉన్నాయని, వాటిపై విచారణ వివిధ దశల్లో ఉందన్నన్నారు. భూ ఆక్రమణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు.
స్టెటస్ కో ఆర్డర్లు తెచ్చుకొని తనిఖీల అడ్డగింత
అసెంబ్లీలో 22ఏపై సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాతే రాష్ట్రంలోని భూ ఆక్రమణలపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ వేశామని సీఎం చెప్పారు. ఈ టీమ్ సేకరించిన అన్యాక్రాంత భూములపై విచారణకు ఆదేశించామన్నారు. ఇందులో సిద్దిపేటలో హరీశ్ రావు మామ హనుమంతరావు చేసిన కబ్జాలు బయటపడ్డాయన్నారు. దీంతో తెరవెనక నుంచి కోర్టుల ద్వారా హరీశ్ రావు స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకుని తనిఖీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మొదట్లో విచారణ కావాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు కోర్టులకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమం పేరుతో పద్మాలయ స్టూడియో, ల్యాంకో హిల్స్‌పై ఆరోపణలు చేసిన కేసీఆర్, హరీశ్ రావు అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోలేదని, దీని వెనుక సెటిల్‌మెంట్లు జరిగాయని ఆరోపించారు.
