- లేని సెక్యూరిటీ సిబ్బంది పేరిట జీతాలు
- ఆడిట్ రికార్డుల్లేవు.. లెక్కాపత్రం లేదు
- క్యాంటీన్‌లో కుళ్లిన కూరగాయలు..
- అపరిశుభ్ర వాతావరణంలో వంటలు
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ దవాఖానలో అక్రమాల గుట్టురట్టవుతున్నది. పాత వైద్య పరికరాలు, వివిధ రకాల సర్జికల్ మిషనరీకి రిపేర్లు చేసి కొత్త మిషన్లు కొన్నట్టు చూపుతూ భారీ మొత్తంలో బిల్లులు ఎత్తినట్టు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. వీటితోపాటు ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు తేలింది. క్యాంటీన్‌లో కుళ్లిన కూరగాయలతో ఆహార పదార్థాలు వండి రోగులు, అటెండెంట్లకు అందిస్తుండడం చూసి అధికారులే విస్తుపోయారు. నిమ్స్ లో వైద్యపరికరాల కొనుగోలు, క్యాంటీన్, మెడికల్ స్టోర్స్ నిర్వహణ, ఔట్ సోర్సింగ్ నియామకాలు, సెక్యూరిటీ గార్డ్స్ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు గురువారం ఏసీబీ, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ ఇన్ స్పెక్టర్లు సోదాలు చేసిన సంగతి తెలిసిందే.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల వరకు కొనసాగిన తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా ఆపరేషన్ థియేటర్లుసహా కీలక విభాగాల్లోని మెడికల్ఎక్విప్మెంట్కు సంబంధించిన రికార్డుల్లో భారీగా అవకతవకలు గుర్తించినట్టు తెలిసింది. ఇందులో కాలం చెల్లిన మిషనరీలను స్క్రాప్ కింద పక్కనపెట్టాల్సి ఉండగా, వాటికే రిపేర్లు చేసి రంగులు వేసి కొత్తవిగా చూపినట్టు తేలింది.
వీటిని కొత్తవిగా చూపుతూ నకిలీ బిల్లులతో భారీ మొత్తంలో నిధులు కొల్లగొట్టినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరు అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెండ్లను విడివిడిగా విచారించి వివరాలు రాబట్టినట్టు తెలిసింది. ఆ పరికరాలు ఏంటనేది ఇప్పటికీ అధికారులు వెల్లడించలేదు.
సెక్యూరిటీ సిబ్బంది పేరిట దోపిడీ
సెక్యూరిటీ గార్డ్స్‌ను నియమించే ఏజెన్సీలతో కుమ్మక్కై న అధికారులు భారీ మొత్తంలో నిధులు కాజేసినట్టు ఏసీబీ విచారణలో తేలింది. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ సుమారు 500 మంది విధుల్లో ఉన్నట్టు చూపారని గుర్తించారు. ఎలాంటి ఆడిట్ రికార్డులు లేకపోవడంతో నిమ్స్ అకౌంట్స్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. వీటి వెనుక నిమ్స్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన లక్ష్మీ భాస్కర్ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఔట్సోర్సింగ్ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయనే అంచనాకు వచ్చారు.
ముఖ్యంగా లక్ష్మీభాస్కర్ కుటుంబానికి చెందిన ఆరుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కింద పెద్దమొత్తంలో జీతాలు పొందుతున్నట్టు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. మరోవైపు క్యాంటీన్ టెండర్లపైనా దృష్టిసారించారు. రోగులు వారి అటెండెంట్లకు సప్లయ్ చేసే ఆహారం నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు.
