వినాయకచవితి2026: బొజ్జ గణపయ్యకు పాల ఉండ్రాళ్లు.. ఉండ్రాళ్ల తాలింపు ..జస్ట్ 10 నిమిషాల్లో తయారీ ..!

వినాయకచవితి2026:  బొజ్జ గణపయ్యకు పాల ఉండ్రాళ్లు.. ఉండ్రాళ్ల తాలింపు ..జస్ట్ 10 నిమిషాల్లో తయారీ ..!

వినాయకుడికి ఉండ్రాళ్లు అంటే బోలెడంత ఇష్టం. ఇవేకాదు బొజ్జగణపయ్యకు బోలెడు ఇష్టాలున్నాయి. అందుకే భోజనప్రియుడైన గణపయ్యకు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ నైవేద్యాల్లో, పాల ఉండ్రాళ్లు, ఉండ్రాళ్ల తాలింపు ...  వెరైటీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.  . 

భోజన ప్రియుడైన బొజ్జ గణపయ్యకు…ఎన్ని ఫలహారాలు పెట్టినా తక్కువే. మరి వినాయక చవితి ( 2026 సెప్టెంబర్​ 14) రోజు వివిధరకాల నైవేద్యాలు పెట్టాల్సిందేగా. అందుకే ఆయనకు ఇష్టమైన, రుచికరమైన వంటలు . ఈ  వినాయకచవితి పండుగకు ఇవి చేసి నైవేద్యంగా పెట్టండి.

పాల ఉండ్రాళ్లు తయారీకి కావాల్సినవి 

  •  బియ్యప్పిండి: 80 గ్రాములు
  •  నీళ్లు: పావులీటర్‌‌
  • నెయ్యి/ వెన్న: ఒక టేబుల్‌ స్పూన్
  •  ఉప్పు: చిటికెడు 
  • పాలు: అర లీటర్‌‌
  • చక్కెర: 120 గ్రాములు
  •  కొబ్బరి తురుము: పావు కప్పు 
  • యాలకుల పొడి: అర టీ స్పూన్

పాల ఉండ్రాళ్లు తయారీ విధానం

 బియ్యప్పిండి జల్లెడ పట్టాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, గోరు వెచ్చగా కాగబెట్టాలి. నీళ్లలో చిటికెడు ఉప్పు, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి/వెన్న, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా ముద్దలా చేయాలి. పిండి చల్లారాక చిన్న చిన్న ఉండలు చేయాలి. 

మరో వెడల్పాటి గిన్నెలో పాలు మరగబెట్టాలి. ఆ పాలలో కొబ్బరి, యాలకుల పొడి, చక్కెర వేసి అది కరిగే వరకు కలుపుతూ ఉండాలి. 

ALSO READ : పది రోజుల పెద్ద పండుగ.. వినాయకచవితి.. 

ఆ తర్వాత ఉండ్రాళ్లను కాగుతున్న పాలలో వేసి ఐదు నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. స్టవ్‌ ఆపేసి, పది నిమిషాలు గిన్నె కదిలించకుండా ఉంచితే ఉండ్రాళ్లు విరిగిపోవు.

ఉండ్రాళ్ల తాలింపు తయారీకి కావాల్సినవి 

  •  బియ్యప్పిండి: ఒక కప్పు 
  • నీళ్లు: ఒక కప్పు
  • ఉప్పు: చిటికెడు
  • నెయ్యి: ఒక టీ స్పూన్
  • ఆవాలు: అర టీ స్పూన్​
  •  జీలకర్ర: అర టీ స్పూన్
  • మినప్పప్పు: ఒక టీ స్పూన్​
  • శెనగపప్పు: ఒక టీ స్పూన్​
  • పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి: మూడు
  • కరివేపాకు: ఒక రెమ్మ
  • నూనె: సరిపడా

ఉండ్రాళ్ల తాలింపు తయారీ విధానం

 ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి. మంట తగ్గించి బియ్యప్పిండి వేస్తూ కలపాలి. నిమిషం తర్వాత స్టవ్​ ఆఫ్​ చేయాలి. 

ఆ పిండిని ప్లేట్​లోకి తీసుకుని ఆరబెట్టి ముద్దగా చేయాలి. దాంతో చిన్నచిన్న ఉండ్రాళ్లుగా చేయాలి. 
నూనె రాసిన ఇడ్లీ ప్లేట్​ మీద వీటిని ఉంచి ఆవిరిపై ఉడికించాలి. 

తర్వాత స్టవ్​పై పాన్​పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. 

ఆ పోపుని ఉండ్రాళ్లలో వేసి కలపాలి. ఉండ్రాళ్ల పాయసంతోపాటు ఈసారి ఉండ్రాళ్లతో తాలింపు ట్రై చేయండి.