తిరుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగి పేరుతో భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం... బాపట్ల జిల్లాకు చెందిన 35 ఏళ్ల గోరంట్ల రూపేష్ బాబు తన ఫొటో, పేరుతో నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డు తయారు చేసుకున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించి టీటీడీ ఉద్యోగి లేదా పూజారిగా పరిచయం చేసుకుంటూ భక్తులను నమ్మించేవాడని పోలీసులు తెలిపారు.
దర్శనం, టికెట్లు, ఇతర సేవలు ఏర్పాటు చేస్తానంటూ భక్తుల నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు తీసుకుని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఓ సందర్భంలో భక్తుల మొబైల్ ద్వారా Paytm ఉపయోగించి తన బెట్టింగ్ ఖాతాలకు నగదు బదిలీ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణలో 20 మందికి పైగా భక్తులను మోసం చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి నకిలీ టీటీడీ ఉద్యోగి ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ అతనిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. దర్శనం, టికెట్లు, వసతి పేరుతో అపరిచితులను లేదా దళారులను నమ్మవద్దని కోరారు. మొబైల్, బ్యాంక్ వివరాలు, UPI, OTP, PIN, ఆధార్ వివరాలను ఎవరికీ ఇవ్వవద్దని హెచ్చరించారు.
టీటీడీకి సంబంధించిన దర్శనం, వసతి తదితర సేవలను అధికారిక మార్గాల ద్వారానే పొందాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
