వయసు మీదపడిన వృద్ధులను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అంటగట్టే ఆర్థిక సంస్థలపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI కొరడా ఝళిపించింది. కెనరా బ్యాంక్ ద్వారా 88 ఏళ్ల వృద్ధుడికి రూల్స్ కి విరుద్ధంగా డెఫర్డ్ యానిటీ పాలసీని విక్రయించిన ‘కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’పై రూ.కోటి భారీ జరిమానా విధించింది. పాలసీల విక్రయం, అండర్‌రైటింగ్, జారీ ప్రక్రియ, పాలసీ నిబంధనల వెల్లడిలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ గుర్తించింది.
అసలు ఏం జరిగింది?
కెనరా బ్యాంకుకు చెందిన 88 ఏళ్ల కస్టమర్ మిస్టర్ అయ్యర్‌కు 'కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ గ్యారెంటీడ్ పెన్షన్ VI' అనే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత డెఫర్డ్ యానిటీ ప్లాన్‌ను అమ్మారు సిబ్బంది. ఈ పాలసీ ప్రకారం ఏటా రూ.2 లక్షల చొప్పున 4 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. అంటే మొత్తం రూ.8 లక్షల ఆర్థిక భారం పడుతుంది. ఇది కస్టమర్ ప్రకటించిన వార్షిక ఆదాయం రూ.10 లక్షలలో దాదాపు 20 శాతానికి సమానం. ఈ పాలసీలో ఆయన 57 ఏళ్ల కుమార్తెను ప్రయోజనాలు పొందేవారుగా చేర్చారు.
IRDAI గుర్తించిన వైలేషన్స్:
ప్రొడక్ట్ బ్రోచర్ ప్రకారం ఈ పాలసీకి ప్రవేశ వయస్సు 30 నుండి 80 సంవత్సరాలు మాత్రమే. కానీ 88 ఏళ్ల వ్యక్తికి ఈ పాలసీని అమ్మటం రూల్స్ వైలేషన్ కిందకు వస్తుంది. ప్రపోజర్, అనూషియరీ అంటే ప్రయోజనాలు పొందే వ్యక్తి వేర్వేరుగా ఉన్నప్పుడు వయస్సు నిబంధనలపై ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పిన సాకులను IRDAI పూర్తిగా తిరస్కరించింది. కస్టమర్ వయస్సు, ఆయన ఆర్థిక స్థోమతను పరిశీలించకుండా భారీ ప్రీమియం చెల్లించేలా ఒప్పించడం సరికాదని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. ప్రీ-ఇష్యూవెన్స్ వెరిఫికేషన్ కాల్‌లో రూ.50వేల 791 వార్షిక పెన్షన్ నేరుగా పాలసీదారుడికే వస్తుందని తప్పుగా వివరించారు. కానీ వాస్తవానికి ఆ మొత్తాన్ని కుమార్తె అందుకోవాల్సి ఉంటుంది.
ప్రపోజల్ ఫారమ్‌లో బెంగళూరు నగరం, మహారాష్ట్ర రాష్ట్రం అని తప్పుగా నమోదు చేయడంతో పాటు.. అనూషియరీ సెక్షన్‌లో కూతురి బ్యాంకు ఖాతా బదులు 88 ఏళ్ల తండ్రి ఖాతా వివరాలు నింపారు సిబ్బంది. అంతేకాకుండా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS), ప్రపోజల్ కాపీని కూడా కస్టమర్‌కు అందజేయలేదు. పాలసీ జారీ చేయకముందే ప్రీమియం డిపాజిట్ వసూలు చేయడం రూల్స్ కి విరుద్ధమని IRDAI తేల్చింది.
డెబిట్ రీఫండ్ చేసినా తప్పు తప్పదు:
వివాదం బయటికి రావడంతో ఇన్సూరెన్స్ కంపెనీ దిద్దుబాటు చర్యలకు దిగింది. రెండో ఏడాది ప్రీమియంతో పాటు మొత్తం రూ.4లక్షల 9వేలను కస్టమర్‌కు వెనక్కి ఇచ్చి, కమిషన్‌ను రద్దు చేసింది. భవిష్యత్తులో 75 ఏళ్లు దాటిన వారికి ప్రొడక్ట్ అర్హతను పరిమితం చేస్తూ నిబంధనలు మార్చింది. అయితే కస్టమర్‌కు డబ్బు రీఫండ్ చేసినంత మాత్రాన జరిగిన చట్టవిరుద్ధ ఉల్లంఘనలు రద్దు కావని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.
బీమా చట్టం, 1938 సెక్షన్ 102 ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ పారదర్శకత పాటించనందుకు రూ. కోటి జరిమానాను విధించింది. అంతేకాకుండా కెనరా బ్యాంక్ ద్వారా గత మూడేళ్లలో 75 ఏళ్లు పైబడిన వారికి విక్రయించిన పాలసీలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, 90 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సీనియర్ సిటిజన్లు ఇలాంటి దీర్ఘకాలిక ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకునేటప్పుడు నిబంధనలను, అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలని రెగ్యులేటర్ సూచిస్తోంది.
