వొడఫోన్ ఐడియా టైం ఆగయా.. రూ.33వేల 250 కోట్లు అప్పు ఇచ్చేందుకు SBI గ్రీన్ సిగ్నల్

వొడఫోన్ ఐడియా టైం ఆగయా.. రూ.33వేల 250 కోట్లు అప్పు ఇచ్చేందుకు SBI గ్రీన్ సిగ్నల్

టెలికాం మార్కెట్లో పూర్వ వైభవాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టెలికాం దిగ్గజం వొడఫోన్ ఐడియాకు భారీ ఆర్థిక భరోసా లభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వొడఫోన్ ఐడియాకు $3.5 బిలియన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.33వేల 250 కోట్ల అప్పు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ కన్సార్టియంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ వంటి ప్రముఖ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి.

ఈ భారీ రుణాన్ని ప్రధానంగా నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధునీకరణకు, ప్రత్యర్థులైన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో ఉన్న అంతరాన్ని తగ్గించుకోవడానికి వొడఫోన్ ఐడియా వినియోగించనుంది. ఈ 10 ఏళ్ల రుణ కాలపరిమితి మొత్తం బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కంపెనీ ఛైర్మన్‌గా కొనసాగాలనే కఠిన నిబంధనను లెండింగ్ సిండికేట్ విధించింది. అలాగే డిఫాల్ట్ రీపేమెంట్ గ్యారెంటీలను కూడా ఈ ఒప్పందంలో చేర్చడం గమనార్హం.

ప్రకటనకు ముందే వొడఫోన్ ఐడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. 2026 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6% వృద్ధితో రూ.11వేల 689 కోట్లకు చేరింది. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం(ARPU), విలీనం తర్వాత మొట్టమొదటిసారిగా నికర చందాదారుల సంఖ్య సానుకూలంగా నమోదు కావడం కంపెనీకి కలిసొచ్చింది.

కంపెనీ నికర నష్టం Q1 FY26లో రూ.6వేల 608 కోట్లు ఉండగా, ప్రస్తుత Q1 FY27 నాటికి అది దాదాపు సగానికి తగ్గి రూ.3వేల 754 కోట్లకు పడిపోయింది. కన్సోలిడేటెడ్ EBITDA 9.1% వృద్ధితో రూ.5వేల 34 కోట్లకు చేరింది. వినియోగదారుల మొత్తం సంఖ్య 193.1 మిలియన్లకు పెరగగా, వీరిలో 67% మంది 4G/5G సేవలను వాడుతున్నారు. సగటు యూజర్ ఆదాయం 10.2% వృద్ధితో రూ.195కి పెరిగింది.

ఇప్పటికే రూ.45వేల కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా రూ.9వేల కోట్ల విలువైన పరికరాల ఆర్డర్లను పెట్టింది. ప్రస్తుత త్రైమాసికంలో రూ.వెయ్యి930 కోట్ల క్యాపెక్స్ వ్యయం చేయగా.. 5G సేవలను 17 సర్కిళ్లలోని 200కి పైగా నగరాలకు విస్తరించింది. తాజా ఎస్‌బీఐ కన్సార్టియం నిధులతో టెలికాం రంగంలో Vi మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కంపెనీ దాదాపు దశాబ్ధకాలం తర్వాత తిరిగి గాడిన పడుతున్న సంకేతాలు కనిపించటంతో ఇన్వెస్టర్లలో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో వొడఫోన్ ఐడియా స్టాక్ కాసుల పంట కురిపిస్తోంది పెట్టుబడిదారులపై.