దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభం నుంచి వరుసగా నష్టాలతో ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ మళ్లీ 108 డాలర్ల మార్కుకు చేరుకోవటం, ద్రవ్యోల్బణం, డాలర్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల వెనకడగుతో సహా మరిన్ని కారణాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో వారాంతంలో శుక్రవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 549 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 195 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 495 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 690 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి ఉదయం 10.30కి.
స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణాలు:
1. భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు:
మిడిల్ ఈస్ట్ సంక్షోభం మరింత ముదరడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు108 డాలర్ల స్థాయికి పెరిగింది. యెమెన్‌లోని మోచా పోర్టును హౌతీ రెబెల్స్ స్వాధీనం చేసుకోవడం, రెడ్ సీ మార్గంలో నౌకలపై దాడులు తీవ్రం కావడంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధి వద్ద కూడా రవాణా పరిమితం కావడంతో క్రూడ్ సరఫరాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేవలం ఒక్క వారంలోనే క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 12% మేర లాభపడ్డాయి.
2. భారత్‌పై తీవ్ర ప్రభావం:
భారత్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. క్రూడ్ ధరల పెరుగుదల దేశ దిగుమతి బిల్లును భారీగా పెంచడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తుందని, కార్పొరేట్ కంపెనీల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం దేశ ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
3. ఉప్పెనలా మారుతున్న బాండ్ ఈల్డ్స్:
అమెరికాలో 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.943% వద్దకు చేరుకుని అక్టోబర్ 2023 తర్వాత అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఇది గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లకు ప్రమాద హెచ్చరికగా మారుతోంది. భారత ప్రభుత్వ బాండ్లపై కూడా దీని ప్రభావం పడింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 10 ఏళ్ల బెంచ్‌మార్క్ బాండ్ ఈల్డ్ 7% దాటి మూడు నెలల గరిష్ట స్థాయి అయిన 7.0211%కి చేరింది.
4. ఏషియన్ మార్కెట్ల విలవిల:
చమురు ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్స్ ప్రభావంతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. జపాన్ నిక్కీ 225 సూచీ దాదాపు 3% పడిపోగా, సౌత్ కొరియా కోస్పి 2% నష్టపోయింది.
5. భారత మార్కెట్ పరిస్థితి:
సెప్టెంబర్ 10, 2026 నాటికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(FIIs) రూ.438 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(DIIs) రూ.1,026 కోట్ల కొనుగోళ్లతో మార్కెట్‌కు కొంత మద్దతునిచ్చారు. నిఫ్టీ మళ్లీ బుల్లిష్ బాట పట్టాలంటే 23,450 - 23,500 జోన్‌ను తిరిగి దక్కించుకోవాలని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి మార్కెట్ బేరిష్ ట్రెండ్‌లో ఉందని, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
