హైదరాబాద్: QR కోడ్లతో వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సిగ్నల్స్, కొత్త వ్యాపార సముదాయాల వద్ద ఒత్తిడి చేయొద్దని ట్రాన్స్‌జెండర్లను మాదాపూర్ పోలీసుల హెచ్చరించారు. మాదాపూర్ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్లకు మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓ సుబ్బారావు, వివిధ సెక్టార్ల సబ్‌ఇన్‌స్పెక్టర్లు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిగ్నల్స్ వద్ద, నూతనంగా ఏర్పాటు చేస్తున్న వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసి డబ్బులు వసూలు చేయవద్దని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిగ్నల్స్ వద్ద QR కోడ్లు చూపిస్తూ వాహనదారులు, ప్రజలపై ఒత్తిడి చేసి డబ్బులు సేకరించడం, కొత్తగా ప్రారంభమవుతున్న వ్యాపార సముదాయాల వద్ద బలవంతంగా వసూళ్లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ప్రజలు, వ్యాపారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా డబ్బులు తీసుకోవాలని, బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు.
మాదాపూర్ పరిధిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా సిగ్నల్స్ వద్ద గుంపులుగా చేరడం, వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి వసూళ్లకు పాల్పడినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ సుబ్బారావు హెచ్చరించారు.
