ఓపెన్ పేజీ : వ్యవసాయానికి కూలీల కొరత.. ఉచితాల ప్రభావమా?

ఓపెన్ పేజీ : వ్యవసాయానికి కూలీల కొరత.. ఉచితాల ప్రభావమా?
  • మారుతున్న గ్రామీణ  ఆర్థిక వ్యవస్థకు సంకేతమా?

ఒకప్పుడు  పొలంలో పని ఉంటే కూలీ దొరికేవాడు.  రైతుకు కూలీ కొరత అనే మాట పెద్దగా వినిపించేది కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారుతోంది.  పంట వేయడానికి కూలీలు దొరకడం లేదు.  దొరికినా గతంతో పోలిస్తే ఎక్కువ కూలీ చెల్లించాల్సి వస్తోంది.  స్థానికంగా కూలీలు అందుబాటులో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకురావాల్సిన  పరిస్థితి  ఏర్పడుతోంది.  

వరి నాట్లు, పత్తి ఏరడం, కలుపు తీయడం, కోత,  హమాలీ వంటి పనుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. అయితే దీనికి కారణం ఏమిటి?  మన  గ్రామీణ ప్రజలు కష్టపడే స్వభావాన్ని కోల్పోయారా?  ఉపాధి హామీ పథకం వ్యవసాయ కూలీలను పొలాలకు దూరం చేసిందా?  ప్రభుత్వ ఉచిత పథకాలు పని చేయాలనే  ప్రేరణను తగ్గిస్తున్నాయా?  లేక  గ్రామీణ భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో సహజంగా వస్తున్న మార్పా?  ఈ ప్రశ్నలకు గణాంకాలతో సరైన సమాధానం వెతకాలి.

గ్రామీణ యువతకు ఇప్పుడు వ్యవసాయం వెలుపల అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి  వచ్చాయి.  నిర్మాణ రంగం,  రవాణా, చిన్న పరిశ్రమలు, డెలివరీ సేవలు, పట్టణాల్లో  రోజువారీ  ఉపాధి,  స్వయం ఉపాధి వంటివి.  ఒకప్పుడు  రైతు పొలంలో రోజంతా పనిచేసి  సంపాదించిన కూలీతో  పోలిస్తే,  పట్టణంలో  లేదా నిర్మాణ రంగంలో తక్కువ శారీరక శ్రమతో ఎక్కువ ఆదాయం వస్తే కార్మికుడు  సహజంగానే  ఆ పనిని ఎంచుకుంటాడు. 

దీనిని  కష్టపడే తత్వం కోల్పోయారు అని చెప్పడం సరైన విశ్లేషణ కాదు.  కార్మికుడి శ్రమకు మార్కెట్లో ఎక్కువ విలువ లభించే చోటుకు అతను వెళ్లడం ఆర్థిక వ్యవస్థలో సహజమైన పరిణామమే. అయితే వ్యవసాయానికి మాత్రం ఇది పెద్ద సవాలుగా మారుతోంది. దీంతో  రైతుకు  మూడు మార్గాలే మిగులుతాయి.  పంట ఖర్చు పెంచడం,  యాంత్రీకరణ వైపు వెళ్లడం, లేదా సాగు తగ్గించడం.

ఉపాధి హామీ.. వ్యవసాయానికి శత్రువా?

ఉపాధి హామీ పథకం ఉద్దేశం గ్రామీణ పేదలకు పని కల్పించడం.  ఆకలి, పేదరికం,  నిరుద్యోగం నుంచి  కుటుంబాలకు కనీస భద్రత  కల్పించడం.  నీటి  సంరక్షణ,  గ్రామీణ మౌలిక వసతులు వంటి ఆస్తులను సృష్టించడం కూడా దాని లక్ష్యాల్లో భాగం.  కాబట్టి ఈ  పథకాన్ని పూర్తిగా తప్పుబట్టడం సరికాదు. అయితే  మరో వాస్తవాన్ని కూడా విస్మరించలేం.  ఈ పథకంలో అర్హులు ఎవరు?  భూమి లేని  వ్యవసాయ కూలిపని చేసేవారేనా?    చిన్న, సన్నకారు రైతులు కూడానా?  అనే  స్పష్టమైన విధానంగా  ఉండాలి.   

కానీ  ఆచరణలో  చూస్తే  గ్రామాలలో  ఎలాంటి నిబంధనలు  లేకుండానే  భూమి ఉన్నా, లేకున్నా,   వయసుతో  సంబంధం లేకుండా ఉపాధి హామీ పథకం కార్డులు ఇవ్వడం వలన ఈ పథకంలో  తప్పులు  జరిగాయని  తెలిసినా సరిచేసే  ధైర్యం ఎవరూ చేయడంలేదు.  అయితే,  ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త చట్టం కింద  వ్యవసాయ పీక్ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఉపాధి హామీ పనుల నిర్వహణను సమన్వయం చేయడానికి కొత్త విధానాలు తీసుకొచ్చారు. ఇది సరైన దిశలోని మార్పు. అయితే దాని అమలును క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఉచితాలు మనిషిని పనిచేయకుండా చేస్తున్నాయా?

ఒక కుటుంబానికి ఉచిత బియ్యం, విద్యుత్ సబ్సిడీ, పెన్షన్, గృహ సహాయం, ఆరోగ్య భద్రత వంటి పథకాలు అందితే,  ఆ కుటుంబ కనీస జీవన వ్యయం కొంత తగ్గుతుంది.  అప్పుడు  అత్యల్ప వేతనానికి అత్యంత కఠినమైన పని చేయాల్సిన  ఒత్తిడి తగ్గవచ్చు.  అయితే,  ఉచితాలు ప్రజలను సోమరులుగా చేస్తున్నాయనడం సరికాదు.  ఎందుకంటే  గ్రామీణ సమాజంలో  విద్య పెరిగింది.  వ్యవసాయేతర  ఉపాధి అవకాశాలు పెరిగాయి.  యువత  తమ శ్రమకు ఎక్కువ విలువ  లభించే  రంగాలకు వెళ్తోంది.  

కాబట్టి  వ్యవసాయ కూలీల కొరతకు ఉచితాలను ఒక్కటే కారణంగా చూపడం వాస్తవాన్ని సరళీకరించడమే అవుతుంది.  అయితే  పని చేయడం కంటే  పని చేయకపోవడమే ఆర్థికంగా,  ఆకర్షణీయంగా మారే పరిస్థితి రాకూడదు. ఇదే  ప్రభుత్వాల ముందున్న విధానపరమైన  సవాలు. ఉచిత బియ్యం అయినా,  ఇతర ప్రభుత్వ  సంక్షేమ పథకాలైనా ఎవరికి ఇవ్వాలి?  ఎంత ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి?  ఎవరు నిజంగా అర్హులు?  ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలను ఎప్పుడు లబ్ధిదారుల జాబితా నుంచి తప్పించాలి?  ఇవే  భవిష్యత్ విధాన నిర్ణయాల్లో కీలక ప్రశ్నలు కావాలి.

పేదరికం శాశ్వత గుర్తింపు కాదు

ఒక కుటుంబం పదేళ్ల క్రితం పేదగా ఉండవచ్చు. నేడు ఆ కుటుంబంలోని పిల్లలు ఉద్యోగాల్లో ఉండవచ్చు, కుటుంబానికి భూమి, వ్యాపారం ఉండవచ్చు, ఆదాయం పెరిగి ఉండవచ్చు. అయినా ఒకసారి సంక్షేమ లబ్ధిదారుగా నమోదైతే, అదే హక్కు తరతరాలుగా కొనసాగితే? అది పేదరిక నిర్మూలన కాదు, - పేదరికాన్ని పరిపాలనాపరంగా శాశ్వతం చేయడం. 

అందుకే ఆధార్, ఆదాయం, ఆస్తులు, విద్యుత్ వినియోగం, వాహనాలు, ఆదాయపు పన్ను,  భూమి రికార్డులు వంటి వివిధ  డేటాబేస్‌‌‌‌‌‌‌‌లను సమన్వయం చేసి ఒక సమగ్ర  గుర్తింపు విధానం 
రూపొందించాలి. నిజమైన పేదలకు మరింత బలమైన మద్దతు ఇవ్వాలి. ఆర్థికంగా ఎదిగిన 
కుటుంబాలను క్రమంగా సంక్షేమం నుంచి ఉత్పాదక ఉపాధి వైపు తీసుకురావాలి.

వలస కూలీలు రాకపోతే?

 తెలంగాణలోని కొన్ని వ్యవసాయ ప్రాంతాల్లో పత్తి, వరి వంటి పంటలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలపై ఆధారపడుతున్న పరిస్థితి ఇప్పటికే కనిపిస్తోంది.  భవిష్యత్తులో  వలస  కూలీల ప్రవాహం తగ్గితే, వ్యవసాయంపై ప్రభావం వరుసగా ఇలా ఉంటుంది.  

కూలీల కొరత, కూలీ ధర పెరుగుదల, సాగు వ్యయం పెరుగుదల, పంట కోతలో ఆలస్యం, దిగుబడి/నాణ్యత నష్టం,  రైతు లాభం తగ్గడం, సాగు విస్తీర్ణం తగ్గడం. అంటే ఇది కేవలం  ‘కూలీ దొరకడం లేదు’ అనే సమస్య కాదు  ఇది ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా మారే అవకాశం ఉంది.

వ్యవసాయ యంత్రాలే పరిష్కారమా?

రేపటి వ్యవసాయం  నిన్నటి వ్యవసాయంలా ఉండదు.  తక్కువ మంది కూలీలతో ఎక్కువ భూమిని సాగు చేయాల్సి ఉంటుంది. అందుకు వ్యవసాయ యంత్రాలను  విస్తరించాలి.   కానీ మన దేశ వ్యవసాయ పరిస్థితులు పూర్తిగా వ్యవసాయ యంత్రాలమీదే ఆధారపడి చేయలేం.  ఎందుకంటే మన దగ్గర చిన్న కమతాలు కాబట్టి.   అందువలన ఎంత వ్యవసాయ యంత్రాలు వచ్చినా కూలీల మీద ఆధార పడకుండా వ్యవసాయం చేయలేం అనేది స్పష్టంగా గ్రామాలలో ఉన్న పరిస్థితి.

రైతు, కూలీ మధ్య విరోధం సృష్టించడం పరిష్కారం కాదు

కూలీకి తగిన వేతనం  రైతు ఇవ్వాలి.  కూలీ కూడా రైతు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలి. కానీ ఈ ముగ్గురినీ పరస్పర విరోధులుగా నిలబెడితే సమస్యకు పరిష్కారం లభించదు. రైతు బతకాలి.  కూలీ బతకాలి. వ్యవసాయం బతకాలి. ఈ మూడు లక్ష్యాలు ఒకేసారి సాధించే విధానమే అవసరం. గ్రామీణ భారతదేశం మారుతోంది. వలసల స్వరూపం మారుతోంది. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. 

సాంకేతికత వ్యవసాయంలోకి వస్తోంది. కాబట్టి  రేపు వలస కూలీలు రాకపోతే మన వ్యవసాయం ఎలా సాగుతుంది?  దానికి సమాధానం ఇప్పుడే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే  రేపటి వ్యవసాయం ఎక్కువమంది కూలీల వ్యవసాయం కాదు. ఎక్కువ ఉత్పాదకత, ఎక్కువ యాంత్రీకరణ, మెరుగైన వేతనాలు, సమర్థవంతమైన సంక్షేమం కలిసిన వ్యవసాయం. ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టాలి.  రైతుకు అండగా నిలవాలి. కూలీకి గౌరవప్రదమైన వేతనం రావాలి. అదే నిజమైన సంక్షేమం. అదే స్థిరమైన వ్యవసాయం.

తెలంగాణకు అగ్రికల్చరల్ లేబర్ మిషన్ అవసరం

రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను  ముందుగానే గుర్తించి సమగ్ర విధానం రూపొందించాలి. ప్రతి మండలంలో ఈ కింది డేటాను సేకరించాలి.  ఎన్ని ఎకరాల వరి,  ఎన్ని ఎకరాల పత్తి సాగవుతోంది.  ఎంత  లేబర్ అవసరం ఉంది.  స్థానికంగా ఎంతమంది కూలీలు అందుబాటులో ఉన్నారు.  

ఎంతమంది వలస కూలీలపై ఆధారపడుతున్నారు. ఎంత యాంత్రీకరణ  ఇప్పటికే  జరిగింది.  వ్యవసాయ సీజన్  ప్రారంభానికి ముందే  ఒక  లేబర్ డిమాండ్  ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్  రూపొందించాలి.  ఎక్కడ  కూలీలు ఎక్కువగా ఉన్నారో,  ఎక్కడ  కొరత ఉందో  ఒక డిజిటల్  ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ద్వారా అనుసంధానం చేయాలి.

- అన్వేష్ రెడ్డి సుంకేట,చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ -

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.