- సిటీలో ఏటా 6 ఫీట్ల నుంచి 40 ఫీట్ల గణనాథుల ఏర్పాటు
- నిమజ్జన ప్రాంతాల్లో తగ్గిన నీటిమట్టం
- డ్రైనేజీ, గుర్రపుడెక్కతో నిండిన చెరువులు, కుంటలు
వరంగల్, వెలుగు: వరంగల్‌లో గణేశ్ నిమజ్జనంపై ఎల్‌నినో ఎఫెక్ట్ పడనుంది. ఈసారి వర్షాల్లేక గ్రేటర్ వరంగల్‌లో ఏటా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే పలు చెరువులు అడుగంటాయి. ఫీట్లలోతు నీరుండే చెరువుల్లో సైతం ఇప్పుడు నడుముల వరకే నీరు ఉంది. మరికొన్ని చెరువులు, కుంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఉన్నపాటి కొద్దిపాటి నీటిలో నగరవాసులు చెత్తాచెదారం వేస్తున్నారు. గుర్రపు డెక్క, నాచు పెరగడంతో గ్రేటర్ వరంగల్ చెరువులు రూపం కోల్పోయాయి. మూణ్నాలుగు రోజుల్లో వినాయక నవరాత్రులు మొదలవుతుండగా.. ఇప్పటికీ వానలు లేకపోవడం, చెరువుల్లో అధికారులు ఎటువంటి పూడికతీత పనులు చేపట్టకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
గ్రేటర్‍లో 8 వేల వినాయక విగ్రహాలు
గ్రేటర్ వరంగల్‌లో ఏటా దాదాపు 8 వేల నుంచి 10 వేల వినాయక విగ్రహాలు నవరాత్రులు పూజలు అందుకుంటున్నాయి. వరంగల్ పోలీస్కమిషనరేట్ పరిధిలోని మూడు జోన్లలో గతేడాది అధికారుల లెక్కల ప్రకారం 6,683 వినాయక విగ్రహాల మండపాలు ఉండగా..సెంట్రల్ జోన్ పరిధిలో 2,675 ఈస్ట్ జోన్‍లో 2,043, వెస్ట్ జోన్‍లో 1,945 విగ్రహాలు ఏర్పాటు చేశారు. 6,354 మండపాలను జియో ట్యాగింగ్ చేశారు. ఇవేగాక గ్రేటర్ ఆలయాలు, కాంప్లెక్సులు, అపార్టుమెంట్లలో మరో 15వందల నుంచి 2 వేల విగ్రహాలు ప్రతిష్టించారు.
ట్రైసిటీలో 22 నిమజ్జన ప్రాంతాలు
ఈ నెల 14 నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. హనుమకొండ, వరంగల్, కాజీపేట నగరాలతో పాటు సిటీని ఆనుకొని ఉండే ప్రాంతాలను కలిపి ఏటా దాదాపు 22 చెరువులు, కుంటల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైసిటీలో ప్రధానంగా హనుమకొండ పద్మాక్షి టెంపుల్ ప్రాంతంలోని సిద్దేశ్వర గుండం, కాజీపేట బంధం చెరువు, వరంగల్ చిన్న వడ్డెపల్లి చెరువు, వరంగల్కోట చెరువు, గీసుగొండ కట్ట మల్లన్న చెరువు, కరీమాబాద్ఉర్సుగుట్ట రంగం చెరువు, మామూనూర్బెస్తం చెరువు, ఖిలా వరంగల్అగర్తల చెరువు, మామూనూర్పెద్ద చెరువు, చల్లా చెరువు, గోపాల్‌పూర్, బీమారం, హసన్‌పర్తి చెరువుల వద్ద పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరగనున్నాయి.
కనిపించని ‘అక్వాటిక్ వీడ్ హార్వెస్టర్లు’
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మేయర్ గుండు సుధారాణి పాలకవర్గంలో చెరువుల శుభ్రత, దోమల నివారణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ప్రత్యేక మిషనరీ కొనుగోలు చేశారు. నగరంలో పదుల సంఖ్యలో ఉన్న చెరువుల్లోని గుర్రపు డెక్క, నాచును తొలగించడానికి అత్యాధునిక అక్వాటిక్ వీడ్ హార్వెస్టర్లు, ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ మిషన్లు వాడుతున్నట్లు చెప్పారు. ఒకట్రెండు చెరువుల్లో కొంత గుర్రపు డెక్కను తొలగించారు. రెండేళ్లుగా ఈ యంత్రాలను ఎక్కడా ఉపయోగించిన దాఖలు లేవు. దీంతో సిటీలోని పలు చెరువులు నీరు లేక వెలవెలబోతుండగా.. ఉన్న కొద్దిపాటి నీటిలోనూ గుర్రపుడెక్క, చెత్తచెదారం పేరుకుపోయి అధ్వానంగా మారాయి. ఇప్పుడున్న చెరువులు, కుంటల్లో 40 ఫీట్ల విగ్రహాలు కాదు కదా కనీసం 10 ఫీట్ల విగ్రహాలను కూడా పూర్తిస్థాయిలో నిమజ్జనం చేసే పరిస్థితుల్లేవు.
