‘సర్’ ఎఫెక్ట్.. సర్టిఫికెట్లకు క్యూ!..గద్వాల జిల్లాలో స్లోగా సర్టిఫికెట్ల జారీ..

‘సర్’ ఎఫెక్ట్.. సర్టిఫికెట్లకు క్యూ!..గద్వాల జిల్లాలో స్లోగా సర్టిఫికెట్ల జారీ..
  •      క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ల కోసం మీసేవ, తహసీల్దార్ ఆఫీస్ ల చుట్టూ జనం
  •      ఇదే అదనుగా బ్రోకర్ల దందా

గద్వాల, వెలుగు:‘సర్’ ఎఫెక్ట్ తో క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ల కోసం -మీసేవ, తహసీల్దార్ ఆఫీస్ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఓటు హక్కు  కోల్పోతామన్న  భయంతో నోటీసులు అందుకున్న ఓటర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ గద్వాల జిల్లాలో సర్టిఫికెట్ల జారీ చాలా స్లోగా నడుస్తోంది. ఇదే అదనుగా బ్రోకర్లు సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ నయా దందాకు తెరలేపారు. 

1,49,281 మంది ఓటర్లకు నోటీసులు

జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 594 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1,49,281 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో ఇప్పటికే చాలామందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారంతా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండాలంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి. అందుకోసం జనాలు రెసిడెన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం మీసేవ, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, జిల్లాలోని ప్రతీ తహసీల్దార్ ఆఫీస్ తో పాటు, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని 20 రోజులు గడిచినా సర్టిఫికెట్లు రావడం లేదని పలువురు వాపోతున్నారు. గద్వాల మండలం తో పాటు గద్వాల టౌన్ కు ఒకే తహసీల్దార్ ఆఫీస్ ఉండడం, మరికొన్నిచోట్ల వర్క్​ ప్రెజర్​ ఉండడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యం అవుతోంది. స్టూడెంట్స్​కు సంబంధించి ఇన్​కమ్ సర్టిఫికెట్లకు కూడా ఎక్కువ మంది వస్తుండడంతో ఈ రద్దీ మరింతగా పెరిగి డీలే అవుతోంది. 

జోరుగా బ్రోకర్ల దందా..

సర్టిఫికెట్ల కోసం జనాలు క్యూ కడుతుండడంతో ఇదే అదనుగా బ్రోకర్లు  భారీగా డబ్బులు దండుకుంటున్నారు. క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో సర్టిఫికెట్ కు రూ.100 ఖర్చు అవుతుండగా, దీన్ని ఆసరాగా చేసుకున్న బ్రోకర్లు సర్టిఫికెట్లు త్వరగా ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తూ సొమ్ము  చేసుకుంటున్నారు. 

వర్క్ ప్రెజర్ తోనే ఆలస్యం
వర్క్ ప్రెజర్ తోనే సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. ‘సర్’ ప్రోగ్రాం లో డీటీలు, ఆర్ ఐలు పాల్గొంటున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఎంక్వయిరీ కొంత ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యం అవుతున్నది. అయినా తాము వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు ఇచ్చేలా చూస్తున్నాం. 
- శ్రీనివాసరావు, ఆర్డీవో, గద్వాల