వనపర్తి/పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లాలోని పలు వెంచర్లలో మున్సిపాలిటీ అనుమతుల కోసం 10 శాతం భూమిని పార్కుల కోసం మార్టిగేజ్ చేసి, ఆ తర్వాత ఆ భూమిని మాయం చేస్తున్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇండ్ల ప్లాట్ల వెంచర్లు వేసేప్పుడు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల అనుమతులు తీసుకునేప్పుడు వెంచర్‌లో పది శాతం భూమిని మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల పేరున పార్కుల కోసం కేటాయిస్తూ మార్టిగేజ్ చేసి అనుమతులు పొందుతారు.
అయితే జిల్లాలో కొన్ని వెంచర్లకు పర్మిషన్ వచ్చాక ఆ పది శాతం భూమిని అమ్ముకుంటున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వెంచర్లలోని పది శాతం స్థలాలపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కొందరు తెలిసీ వెంచరుదారులకు కొమ్ముకాయడంతో పదిశాతం స్థలాలు పట్టపగలే మాయమవుతున్నాయి. దీంతో ప్లాట్లు కొన్న వారు అవి అక్రమమని తెలిసి లబోదిబోమంటూ కోర్టులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
వనపర్తి, పెబ్బేర్లోనే ఎక్కువ..
గత పాలకవర్గాల హయాంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ వెనుక ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్‌తో పాటు, పెబ్బేరులోని హనుమాన్ కాలనీ, భగత్ సింగ్ నగర్, గణేశ్ నగర్, గాయత్రి నగర్, మాధవనగర్, శ్రీచక్రకాలనీ, ఆంజనేయకాలనీ, ప్రియదర్శిని, ఆదర్శనగర్, శ్రీరామ్ కాలనీ తదితర ప్రాంతాల్లో మున్సిపాలిటీకి చెందాల్సిన పది శాతం స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి.
వనపర్తిలోని వెంచర్‌లో ఒక కౌన్సిలర్ బంధువు ఈ స్థలాన్ని విక్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు రాగా అధికారులు బోర్డు పాతారు. పెబ్బేరులోనూ కొందరు పబ్లిక్ ట్యాప్‌లను ధ్వంసం చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో మున్సిపల్ అధికారులు వాటిని అడ్డుకున్నారు.
కోర్టుకెక్కిన వ్యవహారం..
వనపర్తిలో మున్సిపాలిటీకి అప్పగించిన పది శాతం స్థలాలను కొనుగోలు చేసిన 16 మంది బాధితులు రాళ్లు పాతడం, మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం, రిజిస్ట్రేషన్ శాఖ ప్రొహిబిషన్ లిస్టులో చేర్చడం వంటి పరిణామాలతో చివరకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో రూ.లక్షలు పోసి కొన్న స్థలాలు వెంచర్‌లోని 10 శాతం పరిధిలోకి వస్తాయని తెలిసి బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ అక్రమాలపై కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు బాధితులు వినతిపత్రాలు సమర్పిస్తూ న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
