హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐతో మార్ఫింగ్ ఫొటోలు చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పల్లా, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అడిషనల్ డీజీ మహేశ్ భగవత్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం కార్యాలయం బయట వారు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చావును కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు, బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి యత్నించిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
