ఇంట్లో కొబ్బరికాయ కొడితే ఒక ముక్కో అరముక్కో తిని మిగతాది పక్కన పెట్టేస్తారు చాలామంది. హెల్దీ అండ్ టేస్టే కొబ్బరిని అలా వేస్ట్ చేయడం ఎందుకు? అందుకే తినేకొద్దీ తినాలనిపించే కొబ్బరితో తయారు కొత్తకొత్త వంటల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
కొబ్బరి బిస్కెట్ల తయారీకి కావాల్సినవి
- ఎండు కొబ్బరి తురుము- 4 కప్పులు
- చక్కెర పొడి - నాలుగు కప్పులు
- పాలు- రెండు కప్పులు
- వెన్న - ఎనిమిది టేబుల్ స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - రెండు టేబుల్ స్పూన్లు
- గులాబీ ఎసెన్స్- ఒక టీ స్పూన్
కొబ్బరి బిస్కెట్లు తయారీ విధానం
పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్ ల వెన్న, కొబ్బరి తురుము, చక్కెర పొడి, పాలు, జీడిపప్పు వేసి నన్నని మంటపై ఉడికించాలి. మిశ్రమం ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి.
చక్కెర కరిగి మిశ్రమం దగ్గరపడ్డాక మిగిలిన వెన్న, గులాబీ ఎసిన్స్ చేసి మరోసారి కలపాలి. రెండుమూడు నిమిషాల తరువాత నెయ్యి రాసిన ప్లేట్ లో ఆ మిశ్రమాన్ని తీసి సమంగా పరవాలి. చల్లారాక బిస్కెట్లలా కట్ చేయాలి. ఇవి పిల్లలకు ఇస్తే భలే ఇష్టంగా తింటారు.
కొబ్బరి ఉండలు తయారీకి కావాల్సినవి
- ఎండుకొబ్బరి తురుము-రెండు కప్పులు
- చక్కెర లేదాబెల్లం తురుము- ఒక కప్పు
- యాలకుల పొడి- ఒక టీస్పూన్
- డ్రైఫ్రూట్స్ తరుగు- ఒక టేబుల్ స్పూన్
- నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి ఉండలు తయారీ విధానం
పాన్ లో ఎండుకొబ్బరి తురుము వేసి వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేగించాలి. మరొక పాన్ లో చక్కెర లేదా బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం చేయాలి. పాకం దగ్గర పడ్డాక వేగించి ఎండుకొబ్బరి పొడి, డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం కొద్దిగా చల్లారాక గుంద్రంగా లడ్డూలు చేయాలి. ఇవి పిల్లలకు బాగా శక్తిని కూడా ఇస్తాయి.
