- పీఆర్సీ రిపోర్టును 18లోగా సమర్పించాలని చైర్మన్ శివశంకర్‌కు సీఎస్ లేఖ
- ఈ నెల 30తో ముగియనున్న పీఆర్సీ గడువు
- ఈ నేపథ్యంలోనే నివేదిక ఇవ్వాలని అదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దసరా కానుకగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెండో వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) నివేదికను సెప్టెంబర్18వ తేదీలోపే సమర్పించాలని కమిషన్ చైర్మన్ ఎన్.శివశంకర్‌కు సీఎస్ సంజయ్ జాజు బుధవారం లేఖ రాశారు. వాస్తవానికి పీఆర్సీ కమిషన్ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే దసరా పండుగ నాటికి ఉద్యోగులకు శుభవార్త అందించాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం, మరో12 రోజుల ముందే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
పండుగకు ముందే నివేదిక చేతికి వస్తే, అందులోని సిఫారసులను పరిశీలించి ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకునేందుకు తగిన సమయం ఉంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. చాలాకాలంగా వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాల్లో ఈ ఆదేశాలు సరికొత్త ఆశలు రేకెత్తించాయి. నివేదిక అందిన వెంటనే సీఎం స్థాయిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, ఫిట్‌మెంట్ శాతాన్ని అధికారికంగా ఖరారు చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దసరా నాటికి పీఆర్సీ వ్యవహారం కొలిక్కి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
రెండో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు అయిన నాటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు పెద్ద ఎత్తున వినతిపత్రాలు సమర్పించాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గౌరవప్రదమైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని, ఇతర అలవెన్సులను హేతుబద్ధీకరించాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశాయి. చైర్మన్ శివశంకర్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా సంప్రదింపులు పూర్తి చేసింది. రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారం, ప్రస్తుత రాబడి మార్గాలను బేరీజు వేసుకుంటూ సిఫారసుల నివేదిక రూపకల్పనకు తుది మెరుగులు దిద్దుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో పీఆర్సీ ప్రక్రియలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి
