- రూ. 20 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- వీటితో రైల్వే నెట్‌వర్క్ 1,200 కిలోమీటర్ల మేర పెంపు
- తెలంగాణలో మేడ్చల్, యాదాద్రి, జనగాం, వరంగల్ అర్బన్ జిల్లాలు కవర్
- ప్రజా, వస్తు రవాణా సేవలు మరింత మెరుగుదల
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లోని 20 జిల్లాల పరిధిలో 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, మొత్తం రూ.20 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో రైల్వే శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
కేబినెట్ తాజాగా ఆమోదించిన ప్రాజెక్టులలో ఖరగ్‌పూర్–-ఝార్సుగూడ, కట్ని-పెంద్రా రోడ్ సెక్షన్ల మధ్య నాల్గొ లైన్ నిర్మాణం, బిలాస్‌పూర్ (ఉస్లాపూర్)-పెంద్రా రోడ్ సెక్షన్ మధ్య మూడో లైన్ నిర్మాణాలు ఉన్నాయి. ఇతర మూడు ప్రాజెక్టులు అరక్కోణం-రేణిగుంట, వైట్‌ఫీల్డ్– -బంగారపేట మధ్య మూడు, నాల్గొ లైన్ల ఏర్పాటుతో పాటు సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-– కాజీపేట సెక్షన్ మల్టీ ట్రాకింగ్ పనులు ఉన్నాయి.
తెలంగాణలో మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ అర్బన్ జిల్లాలను ఈ ప్రాజెక్టులు కవరు చేస్తాయి. హోసూర్–-ఓమలూరు, సేలం-–కరూర్-–దిండిగల్ అనే మరో రెండు సెక్షన్లలో ఇప్పటికే ఉన్న సింగిల్ లైన్లను డబ్లింగ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో పెరిగే రైల్వే లైన్ సామర్థ్యం మొబిలిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, దీనివల్ల ఇండియన్ రైల్వేస్‌కు మెరుగైన ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సర్వీస్ రిలయబిలిటీ లభిస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు.
రైల్వే ఆపరేషన్లను క్రమబద్ధీకరించడానికి, రద్దీని తగ్గించడానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, స్టేక్‌హోల్డర్ సంప్రదింపుల ద్వారా మల్టీ-మోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్ ఎఫిషియెన్సీని పెంచడంపై దృష్టి సారిస్తూ పీఎం- గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారని.. ఇవి ప్రజా, వస్తు రవాణాకు అవాంతరం లేని కనెక్టివిటీని అందిస్తాయన్నారు.
1,200 కి.మీ. పెరగనున్న నెట్‌వర్క్
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 20 జిల్లాలను కవర్ చేసే ఈ ప్రాజెక్టులు ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌ను సుమారు 1,200 కి.మీ. మేర పెంచుతాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘‘ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు కోటికి పైగా జనాభా కలిగిన 6,900 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి.
తారాబరిని ఆలయం, శ్రీ క్షేత్ర జగన్నాథ ఆలయం (ఝార్సుగూడ సమీపంలోని ప్రాచీన ఆలయం), బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్, విరాటేశ్వర ఆలయం, అమర్‌కంటక్ ఆలయం, జ్వాలేశ్వర్ ధామ్, అచానక్‌మార్ టైగర్ రిజర్వ్, ఖుతాగట్ డ్యామ్, మల్హర్ పురావస్తు ప్రదేశం, రతన్‌పూర్ మహాప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలతో సహా అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుంది.
ప్రతిపాదిత ప్రాజెక్టులు బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు మొదలైన వస్తువుల రవాణాకు అవసరమైన ముఖ్యమైన మార్గాలు. ఇవి దేశ లాజిస్టిక్స్ ఖర్చును, చమురు దిగుమతులను తగ్గించడంలో, 4.48 కోట్ల చెట్లను నాటడానికి సమానమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
అలాగే, వచ్చే ఏడాది మే-జూన్ నాటికి స్వదేశీ హై-స్పీడ్ రైలు కూడా పరీక్షకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. గుజరాత్‌లోని 100 కి.మీ. పొడవున్న సూరత్-–వాపీ సెక్షన్ మధ్య వచ్చే ఏడాది ఆగస్టులో బుల్లెట్ రైలును ప్రారంభించడానికి రైల్వే శాఖ ఇప్పటికే గడువును నిర్ణయించిందన్నారు.
