అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ లవర్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. అందులోనూ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్థాయిలో భారతదేశంలో రేట్లను పెంచటం గమనార్హం. ఐఫోన్ల తయారీకి కేంద్రంగా ఉన్న ఇండియాలోనే అధికంగా రేట్లు ఉండటంపై కొనుగోలుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో ఐఫోన్ల ధరలకు రెక్కలు:
ఆపిల్ తన ఐఫోన్ల ధరలను భారతదేశంలో భారీగా పెంచేసింది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మన దేశంలో ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 10 శాతం మేర మాత్రమే ధరలు పెరిగితే.. భారత్‌లో మాత్రం ఈ పెంపు ఏకంగా 20 నుంచి 30 శాతం చేసింది. బలహీనపడుతున్న రూపాయి మారకం విలువ, దేశీయ ఉత్పత్తి వ్యయం పెరగడం, దిగుమతి సుంకాలు వంటివే ఈ భారీ పెంపునకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
కొత్త ఐఫోన్ల ధరలు:
భారత మార్కెట్లో కొత్తగా విడుదలైన మోడళ్ల ప్రారంభ ధరలు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. బేసిక్ మోడలైన ఐఫోన్ 17 (256జీబీ) ధర రూ.82వేల 900 నుంచి రూ.99వేల 900కి పెరిగింది. ఇక ఆపిల్ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా వచ్చిన 'ఐఫోన్ డూ' రేటు ఏకంగా రూ.2లక్షల 99వేల 900 నుండి ప్రారంభమవుతోంది. స్థానికంగా అసెంబ్లింగ్ యూనిట్ లేకపోవడం వల్ల ఈ ఫోల్డబుల్ ఫోన్‌పై సుమారు 20 శాతం వరకు దిగుమతి సుంకం పడటంతో ధర ఈ స్థాయికి చేరింది.
* ఐఫోన్ 17 (256GB): రూ. 99వేల 900
* ఐఫోన్ 18 ప్రో (256GB): రూ. లక్షా 64వేల 900
* ఐఫోన్ 18 ప్రో మాక్స్ (256GB): రూ. లక్షా 79వేల 900
* ఐఫోన్ ఎయిర్ (256GB): రూ. లక్షా 49వేల 900
* ఐఫోన్ 17ఈ (256GB): రూ. 79వేల 900
* ఐఫోన్ డూ (256GB - ఫోల్డబుల్): రూ. 2లక్షల 99వేల 900
అమెరికా ధరలతో పోలిస్తే ఎంత తేడా?
అమెరికా మార్కెట్‌తో పోల్చి చూస్తే భారత్‌లో ఆపిల్ ఫోన్ల రేట్ల బాదుడు షాక్ చేస్తోంది. అమెరికాలో ఉన్న ధరలకు, ఇండియాలో విక్రయిస్తున్న ధరలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఉదాహరణకు.. అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. లక్షా13వేల 905గా ఉండగా.. అదే ఫోన్‌ను భారత్‌లో రూ. లక్షా 64వేల 900గా ఉంది. అంటే డాలర్ రేటుతో పోల్చినా మన దేశంలో సుమారు రూ.50వేల పైచిలుకు అదనపు భారం పడుతోంది. అమెరికాలో ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ. లక్షా 23వేల 405 కాగా.. భారత్‌లో దాని ప్రారంభ ధర ఏకంగా రూ. లక్షా 79వేల 900గా ఉంది.
పండుగ సీజన్‌పై ప్రభావం:
ఆపిల్ ఫోన్ల భారీ ధరల పెరుగుదల రాబోయే పండుగ సీజన్ అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కొత్త మోడళ్లను కొనటానికి ఒకటికి పదిసార్లు ఆలోచించి వెనకడుగు వేస్తున్నారు. కొందరు రేట్లు పెరగటానికి ముందే కొనుగోళ్లు చేసినప్పటికీ.. చాలామంది మాత్రం పాత మోడళ్లు లేదా ఐఫోన్ 17 వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరీ ఫోన్ కొనాలంటే రూ.2 లక్షలు పెట్టాల్సి రావటం ఏంటి భయ్యా అంటూ కొత్త ఐఫోన్ల రేట్లను చూసి షాకైపోతున్నారు నెటిజన్లు.
