- ప్రజల సమస్యలనే ‘నా గొడవ’గా రాసిన ధీశాలి
- కవులు, రచయితలు ఆయన బాటలో నడవాలె: మంత్రి జూపల్లి
- ప్రముఖ కవి వి.ఆర్. విద్యార్థికి కాళోజీ సాహిత్య పురస్కారం
హైదరాబాద్, వెలుగు: ప్రజా కవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల గొంతుకగా, ఈ నేల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ రచనల్లో తెలంగాణ ప్రజల జీవన విధానం, బాధలు, ఆశలు, ఆకాంక్షలు, పోరాటం, ఆత్మగౌరవం స్పష్టంగా కనిపిస్తాయన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సైనిక కవిగా, ఖండాంతర కవిగా గుర్తింపు పొందిన వి.ఆర్. విద్యార్థి వేలూరి రాములుకు ‘కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం’ను మంత్రి జూపల్లి అందజేసి, శాలువాతో సత్కరించారు. కాళోజీ సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకుని సమాజ హితం కోసం కవులు, రచయితలు ముందుకు సాగాలని మంత్రి అన్నారు. కాళోజీ రాసిన ‘నా గొడవ’ ఆయన వ్యక్తిగత గొడవ కాదని జూపల్లి అన్నారు.
సమాజంలోని అణగారిన వర్గాలు, సామాన్య ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి ఆయన కలం పట్టారని చెప్పారు. ప్రజల కష్టాలను సూటిగా, స్పష్టంగా చెప్పిన నికార్సయిన ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. భాష అంటే కేవలం మాట్లాడుకునే సాధనం కాదని.. అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, అస్తిత్వానికి గుర్తు అని మంత్రి అన్నారు.
కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
