సైఫాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని మాల మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత సతీశ్ మాదిగ కోరారు. ఈ మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితులను అవమానించేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద తాము డప్పులతో నిరసన తెలిపామని సతీష్ పేర్కొన్నారు. అనంతరం తాము నడిచిన రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేయించారని ఆరోపించారు.
దళితులు నడిస్తే నేల మలినమైందన్న భావనతో ఇలా చేయడం వివక్షకు నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.
