శభాష్ కేసీఆర్. ఎంత గొప్ప ఆవిష్కరణ. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు వెతికిన ‘అదృశ్య మురికి’ని బీఆర్ఎస్ నేతలు కనిపెట్టారు. అదే దళితుడి కాలిజాడ మైల! కేసీఆర్ 80 వేల పుస్తకాల తెలివి, కేటీఆర్ అమెరికా సద్వుల జ్ఞానం కలిసి డిస్కవరీ చేసింది .
‘దళితుడి మైల’ పది రూపాయల పసుపు ప్యాకెట్ నీళ్లతో శుద్ధి అవ్వడం. మహా అద్భుతం! వైద్యశాస్త్రం ఇన్నేండ్లు కనిపెట్టలేని సూక్ష్మక్రిమిని, కరోనా కన్నా స్పీడ్‌గా వ్యాపించే వైరస్‌ను బీఆర్ఎస్ నేతలు కనిపెట్టిన్రు. పశువులు చనిపోతే యజమానులు ముక్కులు మూసుకొని దగ్గరికి కూడా రారు. ఏ ఎల్లిగాడొ, మల్లిగాడొ, పుల్లిగాడొ వచ్చి ఎత్క పోవాల్సిందే.
ఎనకట దొరల పాదాలకు ముల్లు గుచ్చకుంట, మైల, దుమ్ము, ధూలి, అశుద్ధం అంటకుంట చెప్పులు కుట్టింది కూడా దళితుల చేతులే కదా సారు. మీ పాదాలకు చెప్పులకు బదులు గంగాజలంలో పసుపు నీళ్లు కల్పుకొని కాళ్లకు సల్లుకుంటే మైలనే అంటకపోతుండే కదా దొరవారు.
దళితుడి కాలు దొరగారి ఫాంహౌస్ బాటమీద పడితే ఆ నేల ‘మైల’ పడిపోతుందట
రోడ్లను ఊడ్చేది, మోరీలు శుభ్రం చేసేది, మీ ఇండ్లలో పాచిపని చేసేది కూడా దళితులే. ఇన్ని అపరిశుభ్రమైన పనులన్నీ చేసేది దళితుడే! కానీ ఇచ్చంత్రం ఏందంటే, ఇన్ని పనులు చేసిన దళితుడి కాలు దొరగారి ఫాంహౌస్ బాటమీద పడితే మాత్రం ఆ నేల ‘మైల’ పడిపోతుందట.
ఆ మైల పసుపు నీళ్లతో శుద్ధి అయితదట, వావ్ ఎంత శాస్త్రీయ పరిశోధన దొరగారు. మురికిని శుభ్రం చేసేవాడే మురికి అట. ఇది మన భారత రాష్ట్ర సమితి కనిపెట్టిన పసుపు మంత్రం. తెలంగాణలోనే కాదు భారతదేశం అంతట గాలిలా పాకింది శుద్ధి మంత్రం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఓ వేదిక మీద మాట్లాడితే ఆ వేదికను బీజేపీ ‘శుద్ధి’ చేసింది.
బిహార్‌లో దళిత ముఖ్యమంత్రి గుడికెళ్తే గుడిని కడిగేశారు
బిహార్‌లో ఓ దళిత ముఖ్యమంత్రి గుడికెళ్తే గుడిని కడిగేశారు. అబ్బో, ఎంత స్పీడు సర్వీసు! ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఇంత ఫాస్ట్‌గా క్లీనింగ్ చేయదేమో. రాజస్థాన్‌లో అయితే ఒక నేత గంగాజలం పట్టుకుని గుడిలోకి దూసుకెళ్లి, కెమెరాల ముందే ‘శుద్ధి యజ్ఞం’ చేసేశాడు. ఆహా నేనే ఈ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్తను, గుడిని కాపాడిన వీరుడిని అన్కొని ఉంటాడు. పాపం, తర్వాత సొంత పార్టీయే అతన్ని సస్పెండ్ చేసి, నువ్వు శుద్ధి చేసింది గుడిని కాదు, పార్టీ పరువును మసి చేశావు అని చెప్పాల్సి వచ్చింది.
దళితుడు ఓటేసేటప్పుడు ఈవీఎం మిషన్లకు మైల అంటదా సారు!
సారు...దళితుడు ఓటేసేటప్పుడు ఈవీఎం మిషన్లకు మైల అంటదా సారు. అయ్యో దానికేం కర్మ దీనికీ ఉంది ఓ మంత్రం ఉంది, సపాయివాల దేవుళ్లు అంటే సాలు. దళితులను భుజాల మీదికి ఎక్కించుకొని ఊరేగిస్తే దళిత పులులు పొంగిపోయి ఈవీఎం మిషన్ల బద్దలయ్యేటట్లు ఓట్లు గుద్ది ఫాంహౌస్‌లో పట్టుపాన్పులల్ల దొరలు ఉండేటట్టు జేత్తరు కదా. అయినా.. పసుపునీళ్ల శుద్ధి మంత్రం.
కేవలం దళితుల మైల కడ్గనీకే పనికొస్తుందా..? రోడ్ల మీద గుంతలు పూడ్చనీకి, పేదల ఆకలి తీర్చనీకి, దోమలు లేకుండా జెయ్యనీకి, ఈగలు వాలకుండా, ఈ మంత్రం పనిజెయ్యదా సారు. ఈ శుద్ధి మంత్రం అభివృద్ధికి తోడైతే కొన్ని లక్షల కోట్లు మిగులుతయ్ కదా సారు. ఇంత శిన్న లాజిక్ మర్సిపోతే ఎట్ల శిన్నసారు.
అంటరానితనం రాలేవరకు దళితులు దండోరా వెయ్యాలే
ఈ దళిత పులులు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పోయి మోగించాల్సింది చావు డప్పు కాదు. వాళ్ల మెదళ్లలో కొన్ని వందల ఏండ్ల నుంచి అట్టలు కట్టిన అంటరానితనం రాలేవరకు దళితులు దండోరా వెయ్యాలే. ఈ దండోరా వేయాలంటే మంచిగ సదువుకోవాలే. సద్వితే దండోరా వేస్తారనే సర్కారు బళ్లలో పంతులు ఉండరు. పంతుళ్లు ఉంటే పోరళ్లు ఉండరు, పోరళ్లు ఉంటే సౌలతులు ఉండవు.
కుక్కకు బొక్కేసినట్టు ఆడోటి ఈడోటి ఇంటర్నేషనల్ స్టాండెడ్ స్కూళ్లు కడ్తున్నం అని ముర్పిస్తరు. ఈ దళిత పులులు ఎప్పుడు దండోరా ఏస్కుంట ఉండాల్సిందే. కానీ ఓ దారికి రానియ్యదు రాజకీయం. అధికారంలో ఉన్నా, రాజ్యాంగం కల్పించిన హక్కులున్నా దళితుడి కాలిముద్రే మైలగా కనిపిస్తుంది.
పసుపునీళ్ల మంత్రానికి కారణం మనుస్మృతి.శ్లోకం 5.85 (5వ అధ్యాయం) చండాలుడిని, రుతుస్రావంలో ఉన్న స్త్రీని, ప్రసవించిన స్త్రీని, శవాన్ని, లేదా శవాన్ని తాకినవారిని తాకితే.. స్నానం చేయడం ద్వారానే శుద్ధి పొందుతారు.
2000 ఏళ్ల క్రితం ‘స్నానంతో శుద్ధి’ చెప్పిన సూత్రమే, ఈనాడు ‘పసుపు నీళ్లతో శుద్ధి’, ‘గంగాజలంతో శుద్ధి’గా రూపాంతరం చెంది కొనసాగుతోంది. ఖర్గే వేదిక కావచ్చు, ఎర్రవల్లి ఫాంహౌస్ బాట కావచ్చు.. వెనుక ఉన్న మనస్తత్వం ఒక్కటే మనుస్మృతి.
- అశోక్ కొండ్రు, సీనియర్ జర్నలిస్ట్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
