పరిణామాలు మోదీవి.. పరీక్షలు యోగికి!

పరిణామాలు మోదీవి..  పరీక్షలు యోగికి!

ఉత్తరప్రదేశ్  దేశరాజకీయాలను శాసించే రాష్ట్రం.​ నెహ్రూ నుంచి మోదీ దాకా కేంద్ర ప్రభుత్వాలను నిర్ణయించిన రాష్ట్రమది. భారతీయ జనతా పార్టీని  అటు కేంద్రంలో 3 సార్లు, ఇటు రాష్ట్రంలో 2 సార్లు ప్రభుత్వాలను తెచ్చిన రాష్ట్రం అది. ఇవాళ దేశంలో బీజేపీ రాజకీయ ప్రయాణానికి హైవే అయినా.. స్పీడ్​ బ్రేకర్​ అయినా.. అది ఉత్తరప్రదేశ్​ రాష్ట్రమే. 2024 ఎన్నికల్లో బీజేపీకి స్పీడ్​బ్రేక్​ పడింది ఆ రాష్ట్రంలోనే. ఆ రాష్ట్రానికి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తేనే, 2029లో  కేంద్రంలో  అది నాలుగోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు బతికి ఉంటాయని పొలిటికల్​ పండితుల అభిప్రాయం.  అందుకే బీజేపీకి ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు మామూలు పరీక్షేమీ కాదు, అదొక అగ్నిపరీక్షే!  దేశ రాజకీయాల్లో  12 ఏండ్లు రాజసం చాటుకున్న బీజేపీ ఉత్థాన పతనాలను నిర్ణయించే రాష్ట్రం మాత్రం ఉత్తరప్రదేశే!

2024 లోక్​సభ ఎన్నికల్లో 240 స్థానాలు మాత్రమే సాధించిన తదుపరి, వరుసగా హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం,  బిహార్​,  పశ్చిమ బెంగాల్​  అసెంబ్లీ  ఎన్నికల్లో అప్రతిహత గెలుపులు సాధించడంతో తిరిగి  పుంజుకున్నామని  బీజేపీ  సంబరపడుతున్నవేళ.. అనూహ్యంగా  అయోధ్య అక్రమాలు బయటకు రావడం, జంతర్​మంతర్​  సీజేపీ ఆందోళన  పొలిటికల్​ డిజాస్టర్​ వలె ఎదురుకావడం చూశాం. 12 వారాల్లో జరిగిన పరిణామాలు.. 12 ఏండ్ల పాలనను వణికించాయంటే తప్పుకాకపోవచ్చు! బీజేపీ కొంత డిఫెన్స్​లో పడిందన్నా,  డ్యామేజ్​ కంట్రోల్‌లో  పడిందన్నా.. కారణాలు మాత్రం చాలామేరకు  స్వయంకృతాలే. 

యోగి పాలన బాగున్నా..

ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు రానుండడం చూస్తే.. ఒకవేళ గెలిపించగలిగితే 
ముఖ్యమంత్రి యోగి వల్లే సాధ్యం కావచ్చు తప్ప, ప్రధాని మోదీ వల్ల మాత్రం కాకపోచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. యోగీ పరిపాలనను ఓడించేంత వ్యతిరేకత యూపీ ప్రజల్లో మాత్రం  రాలేదు. శాంతిభద్రతల విషయంలో, గుడ్​ గవర్నెన్స్​ విషయంలో మంచి పేరొచ్చింది. 

‘లెస్​ కరప్షన్​’ కూడా ఆయన ప్రతిష్టను పెంచింది.  గ్రామాలకు రోడ్​, పవర్​ కనెక్టివిటీ సాధించడం, యూపీలో ఏనాడూ లేని మౌలిక సదుపాయాలు ఇపుడు బాగా ఏర్పడడం యోగి పాలనకు ప్లస్​ పాయింట్లు. అయినా పదేండ్లలో యోగి అన్నీసాధించాడని చెప్పడం సాధ్యం కాకపోయినా.. ఆయన పాలన పట్ల  ప్రజల్లో మాత్రం  అసంతృప్తి లేదని ఈమధ్య వెలువడిన అనేక సర్వేలు కూడా చెపుతున్నాయి.  

యోగి పాలన పట్ల ఇంతటి సానుకూలత ఉన్నా.. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కారణాలు ఏం కాను న్నాయనే చర్చ మాత్రం ఉంది.  కేంద్రంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన యూజీసీ రెగ్యులేషన్స్​, అయోధ్య మందిరంలో జరిగిన అక్రమాలు వంటి కారణాలే యోగి ప్రభుత్వానికి ఉన్న సానుకూలతకు ప్రతిబంధకాలు కావచ్చనే అభిప్రాయం మాత్రం వినబడుతోంది.  

ట్రస్ట్ లో సంఘ్​ పరివార్​ 

అయోధ్య మందిర నిర్మాణంలోగానీ, దాని  ట్రస్ట్​  ఏర్పాటులోగానీ యూపీ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. అంతా ప్రధాని కార్యాలయం ద్వారానే జరిగాయి.  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థస్థల్​ ట్రస్ట్​ను కేంద్రం నియమించింది. అందులో సభ్యులుగా దాదాపు సంఘ్​ పరివార్​ నేతలే ఉన్నారు. వారి నిబద్ధతపై విశ్వాసం ఉండటం వల్లనే కేంద్రం నియమించిందని చెప్పొచ్చు. కానీ  జనరల్​ సెక్రటరీగా  పనిచేసిన చంపత్​ రాయ్​ పై అనేక ఆరోపణలు రావడంతో  నైతికంగా రాజీనామా చేయకతప్పలేదు.  

ముఖ్యంగా చందా చోరీ (హుండీ దోపిడీ) బయటపడటం, సిట్​ దర్యాప్తు జరపడం, హుండీ లెక్కింపులో  అక్రమాలకు పాల్పడిన 8 మంది మాత్రం జైలుపాలు కావడం జరిగింది. సిట్ దర్యాప్తు చంపత్​ రాయ్​కి క్లీన్​ ఇవ్వడం ప్రజలకు రుచించలేదు. సిట్​దర్యాప్తు  చంపత్​ రాయ్​ కొనుగోలు చేసిన భూములపై మాత్రం  జరపలేదు. ఒకవేళ జరిపి ఉంటే,  ట్రస్ట్​ ప్రతిష్టగానీ,  సంఘ్​ పరివార్​ ప్రతిష్టగానీ మరింత పెరిగేదే తప్ప తరిగేది కాదు. 

సత్‌ప్రవర్తన  చెప్పుకునే సంస్థల్లో అవలక్షణాలు

అధికారంలో ఉన్న పార్టీల మద్దతుదారుల్లో కొన్ని  అదనపు (అక్రమ, అవినీతి) లక్షణాలు ఏర్పడుతుంటాయి. కానీ 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న  బీజేపీ మద్దతుదారులైన సత్‌ప్రవర్తన గురించి చెప్పుకునే  సంస్థల్లోనూ అలాంటి అవలక్షణాలు ఏర్పడ్డాయని అయోధ్యలో జరిగిన అక్రమాలు, భూముల కొనుగోళ్ల వ్యవహారాలు చెపుతున్నాయి. 

అయోధ్య  ట్రస్ట్  లో ఉన్నవాళ్లంతా దాదాపు సంఘ్​పరివార్​కు చెందినవారే. కాబట్టి అయోధ్యలో భారీ ఎత్తున అక్రమాలు జరగడం వల్ల  ఎవరు అవునన్నా, కాదన్నా  సంఘ్ పరివార్ ప్రతిష్ట  దెబ్బతిన్నది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ని  కాపాడే ప్రయత్నాలే  సంఘ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. 

చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్ట్ గౌరవప్రదంగా ఆమోదించి, ఆయన సేవలను ప్రశంసిస్తూ పంపించడం గమనార్హం. చంపత్​రాయ్​ భూముల కొనుగోళ్ల అవకతవకల వెనుక మరికొందరు ఉండి ఉండొచ్చనే అనుమానాలూ ఉన్నాయి. లేకపోతే, వృద్ధాప్యంలో అలాంటి అవకతవకలు చేసే అవసరం చంపత్​రాయ్  కు ​లేదనే వారు కూడా ఉన్నారు. 

వివక్ష కులాల జాబితాలో ఓబీసీలను చేర్చడమే జనరల్ కులాల ఆగ్రహం

నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్రం యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్​కమిషన్​) రెగ్యులేషన్స్​ తెచ్చింది.  ఈ నూతన రెగ్యులెషన్స్ ద్వారా​ కుల ఆధారిత వివక్ష నిర్వచనంలో ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీలను కూడా చేర్చారు. దీనిపై జనరల్​ కేటగిరీ  బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కాయస్త్​ లాంటి అనేక ఓసీ కులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది.

 ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ కులాలకు కూడా అట్రాసిటీ హక్కులు కల్పించడమంటే మిగిలిన జనరల్​ కులాలను వేధించడం (హెరాస్​మెంట్)  చేయడానికే కదా అనే అభిప్రాయం జనరల్​  కులాల్లో ఏర్పడింది. చివరకు యూజీసీ రెగ్యులేషన్స్​ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని సుప్రీంకోర్టు భావించి స్టే విధించడంతో జనరల్​ కులాల ఉద్యమాలు కాస్త ఆగిపోయాయి. 

బీజేపీపై జనరల్​ కులాల ఆగ్రహం 

 సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ  జనరల్​ కులాలకు బీజేపీపై ఆగ్రహం సమసిపోలేదని ఇటీవల బిహార్​ లో జరిగిన బంకీపూర్​ ఉప ఎన్నిక,  మధ్యప్రదేశ్​లోని దతియా ఉప ఎన్నిక ఫలితాలే చెపుతున్నాయి.  ఉత్తరప్రదేశ్​,  బిహార్​లో  బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కాయస్తులు ఇతర జనరల్​ కులాలు బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉంటూ వస్తున్నారు. యూపీలో అగ్రకులాల ఓట్లు 20%  ఉన్నాయి. ఈ ఓటు బ్యాంకుకు ఏ మాత్రం తూట్లు పడినా, ఉత్తరప్రదేశ్​లో బీజేపీ గెలుపు అనుమానంలో పడినట్లే!

 యూపీలో నాన్​ యాదవ్​ ఓబీసీలు ఎప్పుడూ బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నవారే.  కాబట్టి యూజీసీ రెగ్యులేషన్స్​ వల్ల బీజేపీకి కొత్తగా వచ్చే ఓబీసీ ఓట్లేమీలేవు, కానీ ఉన్న అగ్రకులాల  ఓట్లే  దూరమవుతాయా అనేదే ఇపుడు బీజేపీకి ఆందోళన కలిగిస్తున్న విషయం! 

అయోధ్య అక్రమాలు, యూజీసీ రెగ్యులేషన్స్​ యోగికి స్పీడ్ బ్రేకర్లు

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అయోధ్య మందిరంలో జరిగిన అవకతవకలు, కేంద్రం తెచ్చిన యూజీసీ రెగ్యులేషన్స్​  ఇపుడు యూపీ ముఖ్యమంత్రి యోగికి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్పీడ్​ బ్రేకర్లు కానున్నాయి. అశేష హిందూ సమాజం విశ్వసనీయతను నిలబెట్టుకోలేకపోయిన ట్రస్ట్ వ్యవహారం, యూజీసీ రెగ్యులేషన్స్​ ప్రభావం..​ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీకి ఏమాత్రం నష్టం చేసినా ఆ తప్పు ఎవరిది అందాం? యోగిదా? మోదీదా? అంటే వేళ్లన్నీ  మోదీ వైపే చూపిస్తాయి. 

ఒక పాపులర్​ సీఎంగా యోగి సునాయాసంగా గెలుస్తాడని, మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని చాలాకాలంగా సెఫాలజిస్టుల అభిప్రాయపడుతూ వస్తున్నారు.  కానీ అయోధ్య అక్రమాలు, యూజీసీ రెగ్యులేషన్స్​ యోగి పాపులారిటీనే భయపెడుతున్నాయి. అయోధ్య అక్రమాలు, యూజీసీ రెగ్యులేషన్స్​ ప్రభావాలను కాదని, యూపీ ప్రజలు యోగి పాపులారిటీ వైపే మొగ్గుచూపితే తప్ప యూపీలో బీజేపీ గెలుపు సాధ్యంకాదు.  నిర్మొహమాటంగా  చెప్పాలంటే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే యోగి కారణమవుతారు, ఓడితే మాత్రం మోదీ కారణమవుతారు. 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్​-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.