- ఫైనల్ మెరిట్ లిస్ట్, ఫస్ట్ ఫేజ్ సీట్ల మ్యాట్రిక్స్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ
- రేపు సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు గడువు
- 28 మెడికల్, 11 డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్ కోటా (కేటగిరి -బీ,-సీ/ఎన్‌ఆర్‌ఐ) ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(కేఎన్ఆర్‌యూహెచ్ఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5:30 గంటల నుంచి సెప్టెంబర్ 11 సాయంత్రం 4 గంటల వరకు tspvtmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
వర్సిటీ విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్టులో మొత్తం 7,113 మంది అభ్యర్థులకు చోటు దక్కగా, అత్యధిక స్కోర్ 590 మార్కులు, కనీస అర్హత స్కోర్ 177 మార్కులుగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో అపోలో, మమత, కామినేని, ప్రతిమ, డెక్కన్, షాదాన్, నీలిమ, మహిళల స్పెషల్ కాలేజీలైన రాజరాజేశ్వరి, వీఆర్‌కే తదితర 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పాటు పణీనీయ, శ్రీ బాలాజీ, సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కాలేజీ సహా 11 డెంటల్ కాలేజీల సీట్లను భర్తీ చేయనున్నారు.
సీటు వదులుకుంటే రూ.20 లక్షల పెనాల్టీ
జీవో నెం.130 నిబంధనల ప్రకారం కేటగిరి–బీ సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ కాగా, 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటా కోసం అన్‌రిజర్వ్‌డ్‌గా కేటాయించారు. కౌన్సెలింగ్‌లో తొలుత 15 శాతం అన్ రిజర్వ్‌డ్ సీట్లను భర్తీ చేశాకే... లోకల్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.
సీటు అలాట్ అయిన అభ్యర్థులు యూనివర్సిటీ ఫీజు కింద ఎంబీబీఎస్ బీ–కేటగిరీకి రూ.లక్ష, ఎన్‌ఆర్‌ఐ కోటాకు రూ.2 లక్షలు, బీడీఎస్ బీ–-కేటగిరీకి రూ.40 వేలు, ఎన్‌ఆర్‌ఐకి రూ.80 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
సీట్ బ్లాకింగ్ నిరోధానికి ఫస్ట్ ఫేజ్‌లో ఆప్షన్లు నమోదు చేయని వారిని, సీటు అలాట్ అయి కాలేజీలో చేరని వారు అర్హులు కాదు. సెకండ్ ఫేజ్ తర్వాత చేరిన సీటును వదులుకుంటే రూ.20 లక్షల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని, తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది.
