- మందమర్రిలో 67.5 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం పూర్తి
- మరో 52 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ పనుల్లో వేగం
- కార్మికుల నివాసాలపై 5 మెగావాట్ల సౌర ప్యానెళ్ల ఏర్పాటు
- 245.5 మెగావాట్ల విద్యుత్‌తో రూ.225 కోట్ల ఆదాయం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: సోలార్ విద్యుత్ ఉత్పత్తి సింగరేణికి సిరులు కురిపిస్తోంది. కంపెనీ వ్యాప్తంగా ఇప్పటికే 245.5 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది నాటికి మరో 104.5 మెగావాట్ల కొత్త ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చి మొత్తం 350 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని మించి మరో 15 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించి మొత్తం 365 మెగావాట్ల సౌర విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. కంపెనీ సాధారణ అవసరాలకు అవసరమైన విద్యుత్‌లో గణనీయమైన భాగాన్ని ఇప్పటికే సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటోంది. సింగరేణి ఏరియాల్లోని ఖాళీ ప్రదేశాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు.
350 మెగావాట్ల లక్ష్యం..
సింగరేణి యాజమాన్యం 350 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం కంపెనీ వ్యాప్తంగా 245.5 మెగావాట్ల విద్యుత్ సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతోంది. మరో 104.5 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్లాంట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే రెండు ప్లాంట్ల ద్వారా 43 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇదే ప్రాంతంలో మరో 67.5 మెగావాట్ల సామర్థ్యంతో మూడో ప్లాంట్ నిర్మాణం చేపట్టగా, పనులు తుది దశకు చేరుకున్నాయి.
విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించి ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో ఇప్పటికే 10 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా నెలకు సుమారు 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీంతో ప్రతి నెలా సుమారు రూ.1.20 కోట్ల ఆదాయం వస్తోంది. కేటీకే ఓసీ-2 ఏరియాలో 10 ఎకరాల్లో మరో 10 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా గోదావరిఖనిలో 22 మెగావాట్లు, ఇల్లందులో 15, ఆర్జీ-1 ఏరియాలో 5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను సింగరేణి వేగవంతం చేసింది.
కార్మికుల ఇండ్లపై సౌర ప్యానెళ్లు..
సింగరేణి వ్యాప్తంగా సుమారు 50 వేల క్వార్టర్లు ఉండగా, వాటిలో 38 వేల మంది కార్మికులు నివాసం ఉంటున్నారు. కార్మికుల సాధారణ అవసరాలకు ఉచితంగా విద్యుత్ అందించడంతో వారి నివాస గృహాల విద్యుత్ బిల్లుల రూపంలో సింగరేణిపై ప్రతి ఏటా సుమారు రూ.100 కోట్ల భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు కార్మికుల నివాసాలపై సౌర ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియను యాజమాన్యం ముమ్మరం చేసింది. మొత్తం 5 మెగావాట్ల సామర్థ్యంతో కార్మికుల ఇండ్లపై సౌర ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురానున్నారు.
బెల్లంపల్లి ఏరియాలోని గొలేటిలో 1.29 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న సౌర ప్యానెళ్ల ద్వారా నెలకు సుమారు రూ.9 లక్షల విద్యుత్ బిల్లు భారం తగ్గనుంది. భూపాలపల్లిలో 790 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ ద్వారా రూ.7 లక్షలు, కొత్తగూడెం ఏరియాలో 1.38 మెగావాట్ల ద్వారా రూ.12 లక్షలు, సత్తుపల్లి ఏరియాలో 1.52 మెగావాట్ల ద్వారా రూ.13 లక్షల వరకు కంపెనీకి ఆదా కానుంది. ఇప్పటికే ఉత్పత్తి అవుతున్న 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ద్వారా సంస్థకు సుమారు రూ.225 కోట్ల ఆదాయం సమకూరుతోంది. కొత్త ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ఈ ఆదాయం మరింత పెరుగుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
పర్యావరణహిత విద్యుత్‌తో కాలుష్య నియంత్రణ..
ప్రకృతి నుంచి లభించే వనరులను వినియోగించి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాం. భూపాలపల్లి ఏరియాలోని కార్మికుల నివాసాలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తయింది. త్వరలోనే వాటిని వినియోగంలోకి తీసుకువస్తాం. కేటీకే ఓసీ-2 ఏరియాలో 10 ఎకరాల్లో 10 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాదికి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నాం. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
-ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, జీఎం, భూపాలపల్లి
