సింగరేణి బొగ్గు.. 90 శాతం రాష్ట్రానికే.. ప్రతీ 10 టన్నుల్లో 9 టన్నులు తెలంగాణకే..

సింగరేణి బొగ్గు.. 90 శాతం రాష్ట్రానికే.. ప్రతీ 10 టన్నుల్లో 9 టన్నులు తెలంగాణకే..
  • దేశం నలుమూలల నుంచి బొగ్గు కోసం పెరిగిన వినతులు
  • ఆగస్టులో విద్యుత్ రంగానికి 40.51 లక్షల టన్నుల బొగ్గు సరఫరా
  • అందులో రాష్ట్రానికే 36.26 లక్షల టన్నులు సప్లై
  • అధికారికంగా లెక్కలు ప్రకటించిన సింగరేణి

హైదరాబాద్, వెలుగు: థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు అవసరాలు పెరుగుతున్న వేళ సింగరేణి సంస్థ స్వరాష్ట్రానికి పెద్దపీట వేస్తోంది. ఎల్‌‌ నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుండటంతో దేశంలోని పలు విద్యుత్ సంస్థలు సింగరేణి బొగ్గు కోసం వినతులు ఇస్తున్నాయి. ‘మాకూ బొగ్గు సరఫరా చేయండి’ అంటూ నిత్యం కోరుతున్నాయి. సింగరేణి బొగ్గుకు ఇంతటి డిమాండ్ ఉన్నప్పటికీ సంస్థ మాత్రం రాష్ట్ర విద్యుత్ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తోంది.

రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా 90 శాతం మేర బొగ్గు సరఫరా చేస్తోంది. కీలక సమయాల్లో విద్యుత్ రంగానికి అండగా నిలుస్తూ రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందిస్తోంది. గత నెలలోని అధికారిక లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆగస్టు నెలలో సింగరేణి సంస్థ నుంచి విద్యుత్ రంగానికి 40.51 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా.. అందులో రాష్ట్రానికే 36.26 లక్షల టన్నులు సప్లై చేసినట్లుగా సింగరేణి ఆఫీసర్లు అధికారికంగా మంగళవారం ప్రకటించారు.  

ప్రతీ 10 టన్నుల్లో 9 టన్నులు తెలంగాణకే.. 
దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు సింగరేణి బొగ్గును సరఫరా చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలు విద్యుత్ సంస్థలకు కొన్ని దశాబ్దాలుగా బొగ్గు రవాణా చేస్తూ ఆయా రాష్ట్రాల ఇంధన అవసరాలను తీరుస్తోంది. అయితే, దేశంలో నెలకొన్న ఎల్‌‌ నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది.

అయినా రాష్ట్రంలో ఉన్న జెన్ కో థర్మల్ పవర్ ప్లాంట్లకు దాదాపు 90 శాతం బొగ్గు స‌‌ర‌‌ఫ‌‌రా జ‌‌రిగింది. స‌‌గ‌‌టున రోజుకు లక్ష 30 వేల 687 ట‌‌న్నుల బొగ్గును థ‌‌ర్మల్ విద్యుత్ కేంద్రాల‌‌కు స‌‌ర‌‌ఫ‌‌రా చేస్తుండ‌‌గా..  అందులో రాష్ట్రంలోని థ‌‌ర్మల్ కేంద్రాల‌‌కు స‌‌గ‌‌టున రోజుకు లక్ష 16 వేల 966 ట‌‌న్నుల బొగ్గును అందిస్తూ రాష్ట్ర ఇంధ‌‌న అవ‌‌స‌‌రాలు తీరుస్తోంది.

బొగ్గు కోసం ఇతర రాష్ట్రాల పట్టు
ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి బొగ్గుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది. కొన్నేళ్లుగా సింగ‌‌రేణికి వినియోగ‌‌దారుగా ఉన్న ప‌‌శ్చిమ‌‌బెంగాల్‌‌లోని దామోద‌‌ర వ్యాలీ కార్పొరేష‌‌న్‌‌ (డీవీసీ) నుంచి మిలియ‌‌న్ ట‌‌న్నులు, దుర్గాపూర్‌‌‌‌లోని ఎన్‌‌టీఈసీఎల్ నుంచి 1.2 మిలియ‌‌న్ ట‌‌న్నులు, ఎన్‌‌ఎస్‌‌పీసీఎల్–ఝజ్జర్ (ఆరావళి) నుంచి వన్​ మిలియ‌‌న్ ట‌‌న్నులు, త‌‌మిళ‌‌నాడులోని ఎన్‌‌టీఈసీఎల్ నుంచి 2 మిలియ‌‌న్ ట‌‌న్నుల బొగ్గు కోసం వినతులు వచ్చాయి.

బొగ్గుకు ఇంత తీవ్రమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో సింగరేణి సంస్థ దీనిని వ్యాపారాత్మకంగా మలుచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల డిమాండ్లను పక్కకు పెట్టి  రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తోంది.

ప్రత్యేక అధికారులను నియమించాం

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణిలో ఉత్పత్తి అయిన మొత్తం బొగ్గులో 90 శాతం బొగ్గును రాష్ట్ర అవసరాలకే సరఫరా చేస్తున్నాం.

దీని కోసం ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించాం. ఆగస్టు నెలలో 40.51 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్​ కేంద్రాలకు సరఫరా చేయగా అందులో రాష్ట్రానికే 36.26 లక్షల టన్నులు సప్లై చేశాం.

డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సింగరేణి సీఎండీ, హైదరాబాద్