కుళ్లిపోయిన కూరగాయలు.. పాడైపోయిన మాంసం.. కూకట్‌‌ పల్లిలోని ఈ పీజీ హాస్టల్స్లో ఇంత ఘోరమా..?

కుళ్లిపోయిన కూరగాయలు.. పాడైపోయిన మాంసం.. కూకట్‌‌ పల్లిలోని ఈ పీజీ హాస్టల్స్లో ఇంత ఘోరమా..?
  • కూకట్‌‌ పల్లిలోని హోటళ్లు, హాస్టళ్లు, స్వీట్  హౌజ్ లపై టీజీ సేఫ్  దాడులు
  • 5 సంస్థల లైసెన్సులు సస్పెండ్.. పర్మిషన్  లేని హాస్టల్  సీజ్
  • ప్యారడైజ్, మెహఫిల్  సహా పలు హోటళ్లకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: కుళ్లిపోయిన కూరగాయలు, పాడైపోయిన మాంసంతో ఆహారాన్ని తయారు చేస్తున్న హోటళ్లు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. కూకట్‌‌ పల్లి పరిధిలోని పలు ఫుడ్  సెంటర్లు, హాస్టళ్లు, బేకరీలు, స్వీట్ హౌజ్ లపై తెలంగాణ స్టాండర్డ్స్  అథారిటీ ఫర్  ఫుడ్  అండ్  ఎసెన్షియల్  డ్రగ్స్(టీజీ సేఫ్) ఎన్‌‌ ఫోర్స్‌‌ మెంట్  డిపార్ట్​మెంట్ కు చెందిన ఫుడ్  సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 10 టీమ్​లు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.

ఈ తనిఖీల్లో భాగంగా దాదూస్  మిఠాయి వాటిక, గుమ్మడి ఫుడ్స్, ప్యారడైజ్  ఫుడ్  కోర్ట్, కేఎస్  బేకర్స్, చైతన్య ఫుడ్  కోర్ట్, గోదావరి మిఠాయి, మణికంఠ లైవ్  స్పేస్  లగ్జరీ ఉమెన్స్  హాస్టల్, లక్ష్మీ వెంగమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్  మెస్, శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్ పీజీ హాస్టల్, కేఎస్  మెన్స్  పీజీ హాస్టల్, జీవీకే న్యూ లగ్జరీ పీజీ మెన్స్ హాస్టల్, హోటల్  సితార గ్రాండ్, మెహఫిల్  రెస్టారెంట్, శ్రీకన్య కంఫర్ట్  రెస్టారెంట్, బేక్  మ్యాక్స్  ఫుడ్స్(బ్రౌన్  బేర్   మానుఫాక్చరింగ్  యూనిట్), మండి కింగ్  అరేబియన్  రెస్టారెంట్, కూకట్‌‌పల్లి మండి, భూలక్ష్మి మెస్, శ్రీ హర్ష డీలక్స్  మెస్  సహా మొత్తం 20 యూనిట్లలో తనిఖీలు చేశారు.

కిచెన్ లు అపరిశుభ్రం..
తనిఖీల సందర్భంగా కిచెన్లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం ఉండడాన్ని, అపరిశుభ్రతను అధికారులు గుర్తించారు. రిఫ్రిజిరేటర్లలో వెజ్, నాన్  వెజ్  ఫుడ్  ఐటెమ్స్ ను కలగలిపి ఉంచడం, ఆహారాలపై లేబులింగ్  లేకపోవడం, గడువు ముగిసిన సరుకులు నిల్వ చేయడం, సరైన రికార్డులు పాటించకపోవడం, వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. దీంతో ఐదు సంస్థల ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ లైసెన్సులను వెంటనే సస్పెండ్  చేశారు.

బొద్దింకలు, పురుగులు, బూజు పట్టిన పల్లీలు ఉన్న మణికంఠ లైవ్  స్పేస్  లగ్జరీ ఉమెన్స్  హాస్టల్, బొద్దింకలు, ఎలుకలు, గడువు ముగిసిన సరుకులతో ఉన్న శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్  పీజీ హాస్టల్, బొద్దింకలు, ఎలుకలు, ఫ్రిజ్  నిర్వహణ లోపాలు ఉన్న హోటల్  సితార గ్రాండ్, ఈగలు, బొద్దింకలు, పాడైన కూరగాయలతో ఉన్న బేక్  మ్యాక్స్  ఫుడ్స్ (బ్రౌన్ బేర్ యూనిట్), వెజ్, నాన్ వెజ్, పచ్చి, వండిన ఆహారాన్ని వేరుచేయని మండి కింగ్  అరేబియన్  రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్  చేయగా, ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న జీవీకే న్యూ లగ్జరీ పీజీ మెన్స్  హాస్టల్‌‌ ను పూర్తిగా మూసివేయించారు.

రూల్స్ బ్రేక్ చేసిన సంస్థలకు నోటీసులు 
రూల్స్ బ్రేక్  చేసిన సంస్థలకు పెనాల్టీలు విధించేందుకు ప్యారడైజ్  ఫుడ్  కోర్ట్, చైతన్య ఫుడ్  కోర్ట్, భూలక్ష్మి మెస్, గోదావరి మిఠాయిలకు అధికారులు షోకాజ్  నోటీసులు జారీ చేయనున్నారు. తనిఖీల్లో వెల్లడైన లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ గుమ్మడి ఫుడ్స్ లోని శ్రీ మహాలక్ష్మి కేంద్ర, కేఎస్  బేకర్స్, లక్ష్మీ వెంగమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్  మెస్, మెహఫిల్  రెస్టారెంట్, శ్రీ హర్ష డీలక్స్  మెస్‌‌లకు ఇంప్రూవ్‌‌మెంట్  నోటీసులు అందించారు.

వీటిని త్వరలోనే పున:పరిశీలించి నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ డ్రైవ్‌‌ లో కల్తీ అనుమానంతో 20 ఫుడ్  శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌‌ లకు పంపగా, పాడైపోయిన కూరగాయలతో పాటు పురుగులు పట్టిన పల్లీలు, పిండి పదార్థాలు, ఎండుమిర్చిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.