నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీకి.. నీటి గండం..రంగనాయక సాగర్ లో అడుగంటిన జలాలు

నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీకి.. నీటి గండం..రంగనాయక సాగర్ లో అడుగంటిన జలాలు
  • బోర్లు, ట్యాంకర్ల ద్వారా సేకరణ
  • తపాసుపల్లి, దేవాదుల నుంచి నీటి తరలింపునకు ప్రయత్నాలు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రంగనాయక సాగర్ లో నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోవడంతో అక్కడి నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. మరో వైపు ఫ్యాక్టరీలోని నీటి నిల్వలు సైతం పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం బోర్లు, ట్యాంకర్లపై ఆధారపడుతూ ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. భవిష్యత్ లో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై ఆఫీసర్లు దృష్టి పెట్టారు.

రోజుకు ఆరు లక్షల లీటర్ల వినియోగం

నర్మెట గ్రామంలో 65 ఎకరాల్లో రూ. 300 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మార్చిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ గంటకు 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. ఉత్పత్తి పెరిగే కొద్ది క్రషింగ్ సామర్థ్యాన్ని రోజుకు 600 టన్నులకు పెంచుకునే విధంగా రూపకల్పన చేశారు. ఈ ఫ్యాక్టరీలో ఆయిల్ పామ్ క్రషింగ్ కు ప్రతి రోజు ఆరు లక్షల లీటర్ల నీరు అవసరం పడుతుంది. 

కానీ ఉత్పత్తి ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఫ్యాక్టరీలో నీటి కొరత ఏర్పడింది. ఫ్యాక్టరీ అవసరాల కోసం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఫ్యాక్టరీలో 10 కోట్ల లీటర్ల కెపాసిటీ కలిగిన పాండ్ నుంచి నిర్మించి, సుమారు ఏడు కోట్ల లీటర్ల నీటిని నింపి ఫ్యాక్టరీ అవసరాల కోసం వాడుకుంటున్నారు. కొంత కాలంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరడంతో అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయింది. 

దీనికి తోడు ఫ్యాక్టరీలోని నీటి నిల్వలు సైతం పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఆయిల్ పామ్ క్రషింగ్ కు పీక్ సీజన్ కావడంతో ఫ్యాక్టరీ నిర్వహణకు అవసరమైన నీటిని అతి కష్టం మీద సేకరిస్తున్నారు. ఫ్యాక్టరీలోని పాండ్ పూర్తిగా ఎండిపోవడంతో స్థానికంగా ఉన్న బోర్లు, ప్రైవేట్ ట్యాంకర్ల తో నీటిని సమకూర్చుకుని ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు.

తపాసుపల్లి, దేవాదుల నీటి తరలింపునకు ప్రయత్నాలు

పామాయిల్ క్రషింగ్ పీక్ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆఫీసర్లు దృష్టి సారించారు. ప్రస్తుతం రోజు వారీ ఫ్యాక్టరీ కోసం బోర్లపై ఆధారపడినా భవిష్యత్ లో నీటి ఎద్దడి మరింత తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తపాసుపల్లి గానీ, దేవాదుల నుంచి గానీ నీటిని మళ్లించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 

ఆయా రిజర్వాయర్ల నుంచి నీటి తరలింపు కోసం అనుగుణంగా కాల్వలు ఉన్నాయా అనే విషయంపై ఇటీవలే ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ ఇది కార్యరూపం దాల్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాల మట్టాలు సైతం క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతానికి బోర్లపై ఆధారపడి క్రషింగ్ చేస్తున్నా... రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునే అవకాశాలను సైతం 
పరిశీలిస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం 

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నీటి ఎద్దడి ఏర్పడినా క్రషింగ్ పై ఎలాంటీ ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. రంగనాయక సాగర్ నుంచి నీళ్లు రాకపోవడం వల్ల ఫ్యాక్టరీలోని పాండ్ ఎండిపోవడంతో తాత్కాలికంగా బోర్లు, ట్యాంకర్ల తో రోజు వారీ నిర్వహణకు నీటిని తెప్పిస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. తపాసుపల్లి, దేవాదుల నుంచి నీటిని తరలించడానికి ఉన్న అవకాశాలపై  ఇరిగేషన్ అధికారులు సర్వే పూర్తి చేశారు.

– ప్రణీశ్ గౌడ్, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇన్ చార్జి-