‘‘కథలోనూ, పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నా. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’లో నటించడానికి కూడా కారణమదే’’ అని చెప్పింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఆనంద్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ఈ చిత్రానికి ‘90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వం వహించాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈనెల 11న సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు చదువుకోడానికి యూకే వెళ్లి అక్కడ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఆ ఇద్దరి లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, ప్రైవేట్ సంభాషణలపై నడిచే సినిమా ఇది. జీవితాన్ని ఒక్కో కోణంలో చూసే వీళ్లిద్దరూ ఎలా కలిశారు, వాళ్ల ఆలోచనలు ఈ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చాయి. ఎలాంటి హంగామా లేకుండా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. తనకోసం తాను నిలబడే ‘కడలి’ అనే స్ట్రాంగ్ అమ్మాయిగా నా మనసుకు నచ్చిన పాత్రలో నటించా.
ముందుగా మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్‌గా ఉండాలి అనే విషయాన్ని ఈ చిత్రంతో నేర్చుకున్నా. ఇక లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించిన కంటెంట్ కనుక ‘90s’ వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్‌టైనర్‌లా ఉండకపోవచ్చు. అయితే దర్శకుడు ఆదిత్య హసన్.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దృష్టిలో ఉంచుకుని, కంటెంట్ పరంగా సినిమాకు అవసరమైనది మాత్రమే చూపించారు కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు.
ఇక ‘బేబి’ లాంటి హిట్ తర్వాత ఆనంద్, నేను కలిసి నటించిన సినిమా కావడంతో మాపై కొంత ఒత్తిడి ఉంటుంది. దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని వర్క్ చేశాం. ఇందులో మమ్మల్ని చూసినప్పుడు ‘బేబి’ గుర్తుకు రాకపోతే మేము విజయం సాధించినట్టే. ప్రస్తుతం సితార బ్యానర్‌లోనే నితిన్ గారితో ఓ సినిమా చేస్తున్నా. అలాగే తమిళంలో రెండు సినిమాలు జరుగుతున్నాయి. హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నా” అని చెప్పింది.
