కేటీఆర్, హరీష్ రావుపై మరో కేసు.. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో FIR ఫైల్

కేటీఆర్, హరీష్ రావుపై మరో కేసు.. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో FIR ఫైల్

హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్‎ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సైఫాబాద్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది. మహిళా కానిస్టేబుల్‌ కె. పద్మావతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ 3 దగ్గర మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దుర్భాషలాడి, బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. టీషర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని పేర్కొన్నారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారన్నారని ఆరోపించారు. పద్మావతి ఫిర్యాదుతో కేటీఆర్, హరీశ్‌రావు, నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సహా మరికొందరిపై BNSలోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 సెక్షన్లతో పాటు 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళా పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ, మీడియా వీడియోలు, ఫొటోలు, వైద్య రికార్డులను పోలీసులు పరిశీలించనున్నారు. కాగా, ఇదే వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే.