పోలాల అమావాస్య.. సంతాన సౌభాగ్య వ్రతం.. కందమొక్కకు పూజ..ఏ రోజు చేయాలంటే.!

పోలాల అమావాస్య.. సంతాన సౌభాగ్య వ్రతం.. కందమొక్కకు పూజ..ఏ రోజు చేయాలంటే.!

మరో రెండు రోజల్లో ( సెప్టెంబర్​ 8 నాటికి) ఈ ఏడాది ( 2026) శ్రావణమాసం ముగియనుంది.  ప్రతి నెలలో అమావాస్య వచ్చినా శ్రావణ మాసం అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది.  ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఎప్పుడు వచ్చింది.. ఆ రోజు ఏం చేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

పురాణాల ప్రకారం శ్రావణమాసం అమావాస్యను పోలాల అమావాస్య.. సంతాన అమావాస్య అంటారు. 
ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ..వివాహిత మహిళలు తమ సంతానం కోసం, పిల్లల యోగ క్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. 

తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది (2026)  సెప్టెంబర్ 11వ తేదీన అంటే శ్రావణ మాసంలో చివరి రోజున శుక్రవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున శుభ ముహుర్తం ఎప్పుడొచ్చింది.. ఈరోజు వ్రతాన్ని ఎలా ఆచరించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శుభ ముహుర్తం..

  • పోలాల అమావాస్య తిథి ప్రారంభం: సెప్టెంబర్ 10 ఉదయం 10:33  గంటలకు
  • పోలాల అమావాస్య  తిథి ముగింపు: సెప్టెంబర్ 11ఉదయం 8:56 గంటల వరకు.
  • సూర్యోదయానికి అమావాస్య తిథి ఉన్నందున సెప్టెంబర్ 11వ తేదీనే పూజకు పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. 

పూజా విధానం..

  • పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఇంటిని శుభ్రం చేసి.. పూజా గదిలో  కందమొక్కను ఉంచాలి. 
  • కంద  మొక్కకు తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. 
  • ముందుగా వినాయకుడిని పూజించాలి
  • కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని గానీ, సంతాన లక్ష్మీదేవిని .. అమ్మవారిని ఆవాహనం చేయాలి
  • అమ్మవారికి ( కంద మొక్కకు) షోడపశోపచారాలతో పూజలు చేయాలి. 
  • ధూపం.. దీపం. హారతి ఇవ్వాలి.
  • పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. మీ చుట్టు పక్కల ఇళ్ల నుంచి కూరగాయలను అడిగి తీసుకుని, వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 
  • పూజ పూర్తయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాయనం ఇచ్చే ఆచారం కూడా ఉంది.

పోలాల అమావాస్య ప్రాముఖ్యత..

పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు.. అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డల్ని చూసి ఎంతో దుఃఖంతో ఆమె ఊరి వెలుపల ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం పిల్లల్ని సమాధి చేస్తూ వెళ్తోంది. అయితే ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుడుతున్నారు.. మళ్లీ పోలాల అమావాస్య సమయానికి మరణిస్తున్నారు. దీంతో తాను నోము నోచుకోవడానికి ఎవరిని పేరంటానికి పిలిచినా రావడానికి విముఖత చూపేవారు.

►ALSO READ | అప్పడాలపై పాదముద్రలేంటి.. ఈ అచ్చులు చూస్తే తినేవాళ్లు కూడా వాంతులు చేసుకుంటారు!

ఆ సమయంలో తను పూర్వ జన్మలో ఏ పాపం చేశానో నాకు పుట్టిన బిడ్డలు ప్రతిసారీ చనిపోతున్నారని బాధపడింది. అప్పుడు పోచమ్మ తల్లి ‘‘బ్రాహ్మణమ్మా! గత జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం, గారెలు పెట్టావు. పులుపు, తీపి సరిపోయిందో లేదో అని చూశావు. ఆచారాలన్నీ పాటించకుండా అమంగళం చేశావు. అందుకే నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికే మరణిస్తున్నారు’’ అని చెప్పింది.తన తప్పును తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచమ్మ తల్లి కాళ్ల మీద పడి తనను క్షమించమని కోరింది. ఈ వ్రత విధానం తనకు తెలపాలని కోరగా పోచమ్మ ఇలా వివరించారు. 

‘‘శ్రావణ మాసంలో చివరి రోజున, భాద్రపదంలో మొదటగా వచ్చే రోజును పోలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన గోమాత పేడతో అలికి పసుపు, కుంకుమలతో  కందమొక్కను అమ్మగా భావించి అలంకరించాలి.  ఆ తరువాత  9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. 

పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. భోజనం చేసిన తర్వాత తాంబూలం, మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా, మలేరియా, మశూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు’’అని వివరించారు. ఆ తర్వాత వ్రతాన్ని చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డల్ని పొందినట్లు పురాణాల్లో పేర్కొనబడింది.


Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.