ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో పెట్టుబడులు : చెన్నై సూపర్ కింగ్స్ జాయిన్ అవుతుందా..?

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో పెట్టుబడులు : చెన్నై సూపర్ కింగ్స్ జాయిన్ అవుతుందా..?

CSK To Enter Big Bash: ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (BBL) ప్రైవేటీకరణకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల గ్లోబల్ విస్తరణ వేగవంతమవుతున్న వేళ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టును 100 శాతం ప్రైవేట్ వాటాల విక్రయానికి ఉంచడంతో ఈ అమ్మకాల ప్రక్రియ స్టార్ట్ అయింది. సీపీఎల్, ది హండ్రెడ్, ఎస్‌ఏ20 లీగ్‌ల తరహాలోనే బిగ్ బాష్ లీగ్‌లోనూ మెజారిటీ జట్లను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తెగ పోటీ పడుతున్నారు.

మెల్‌బోర్న్‌పై ముంబై కన్ను.. పెర్త్‌పై సన్‌రైజర్స్ ఆసక్తి: 

బిగ్ బాష్ లీగ్‌ జట్లను దక్కించుకోవడానికి ఐపీఎల్ దిగ్గజాలు బాగా శ్రమిస్తున్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (RPSG గ్రూప్), రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని లక్ష్మీ మిట్టల్ బీబీఎల్ జట్లను కొనుగోలు చేసే ప్రధాన రేసులో నిలిచారు. ముంబై ఇండియన్స్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీపై ఆసక్తి చూపగా, సన్‌రైజర్స్ పెర్త్ జట్టును, ఢిల్లీ క్యాపిటల్స్ సిడ్నీ ఫ్రాంచైజీని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వెనుక హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను నిర్మిస్తూ క్రికెట్ విస్తరణకు తమ వంతు కృషి చేస్తోంది.

కెన్బెర్రా సూపర్ కింగ్స్ వస్తుందా?: 

బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణ వార్త రాగానే సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు హల్‌చల్ చేశారు. కెన్బెర్రా సూపర్ కింగ్స్ పేరుతో జట్టు వస్తే బాగుంటుందని ఆశగా కామెంట్లు చేశారు. కానీ సీఎస్‌కే యాజమాన్యం అభిమానులకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది. సీఎస్‌కే సమీప భవిష్యత్తులో కొత్తగా ఏ లీగ్‌లోకి అడుగుపెట్టడం లేదని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు ఎస్‌ఏ20లో జోబర్గ్ సూపర్ కింగ్స్, మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే ఉన్నాయని, కొత్తగా బీబీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. 

క్రికెట్ ఆస్ట్రేలియా నెక్స్ట్ లెవెల్ ప్లాన్: 

బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణ ప్రక్రియ వల్ల రాబోయే పురుషుల, మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్లకు ఎలాంటి ఆటంకం ఉండదని క్రికెట్ ఆస్ట్రేలియా ధీమా వ్యక్తం చేసింది. మరో రెండు జట్లను కూడా విక్రయానికి ఉంచడం వలన భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, స్టేడియం మౌలిక వసతులను మెరుగుపరచవచ్చని బోర్డు భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విస్తరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియా లీగ్‌లోనూ ఇండియన్ ఓనర్ల ఆధిపత్యం ఖాయంగా కనిపిస్తోంది.