హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్కు రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదని.. ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం (సెప్టెంబర్ 8) మండలిలో మహేష్ కుమార్ రియాక్ట్ అయ్యారు.
స్పీకర్‌ను అవమానించడం తాతా మధు ఆలోచన కాదని.. తాతా మధును కేసీఆర్ ఉసిగొల్పి అలా మాట్లాడించారని ఆరోపించారు. దళిత మహిళలను అవమానించిన పార్టీ బీఆర్ఎస్ అని.. బీఆర్ఎస్ దళిత, గిరిజనుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు.
వివాదం ఏంటంటే..?
సోమవారం (సెప్టెంబర్ 7) తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఫెయిల్ అని ప్రింట్ చేసి ఉన్న బ్లాక్ టీ షర్ట్స్తో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. దీంతో అసెంబ్లీ గేట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు.
బ్లాక్ టీ షర్టులతో లోపలికి అనుమతించలేదు. తమను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర ఆగ్రహానికి గురై 'ఎవడ్రా స్పీకర్.. ఎవడ్రా మీకు అధికారం ఇచ్చింది' అంటూ స్పీకర్ను ఏకవచనంతో సంబోధించాడని కాంగ్రెస్ ఆరోపించింది.
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి కనీస మర్యాద ఇవ్వకుండా బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండటం నచ్చకే బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను శాసన సభలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని తక్షణమే డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
