ఆఫ్ఘన్‌తో సమరానికి ముందే గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్: శ్రేయస్ అయ్యర్ సేన సిద్ధం!

ఆఫ్ఘన్‌తో సమరానికి ముందే గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్: శ్రేయస్ అయ్యర్ సేన సిద్ధం!

Washington Sundar: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించినట్లు బీసీసీఐ మెడికల్ టీమ్ స్పష్టం చేసింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన సుందర్, ప్రస్తుతం పూర్తిస్థాయిలో రికవర్ అవ్వడంతో శ్రేయస్ సేనకు కొండంత అండ లభించింది. 2026 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో కీలక పాత్ర పోషించిన వాషీ రీఎంట్రీతో భారత స్పిన్ ఆల్‌రౌండ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.

ఢిల్లీ వేదికగా పోరు.. ప్రాక్టీస్ ప్రారంభించిన ఆఫ్ఘన్: 

సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ 3 టీ20ల సిరీస్ కొనసాగనుంది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) హోస్ట్ చేస్తున్న ఈ సిరీస్ కోసం ఆఫ్ఘన్ జట్టు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్ కూడా స్టార్ట్ చేసింది. మరోవైపు చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ముగ్గురు భారత ఆటగాళ్లు బిజీగా ఉండటంతో ఇండియన్ టీమ్ ఇంకా పూర్తిస్థాయిలో క్యాంప్‌లో చేరలేదు. దులీప్ ట్రోఫీ ముగియగానే శ్రేయస్ నాయకత్వంలో జట్టు సభ్యులందరూ కలిసి అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్నాహకాలను వేగవంతం చేయనున్నారు.

బుమ్రా, హర్షిత్, నితీష్ రెడ్డి పరిస్థితి గందరగోళం:  

వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సాధించినప్పటికీ, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాల ఫిట్‌నెస్‌పై ఇంకా బీసీసీఐ నుంచి పూర్తిస్థాయిలో హెల్త్ బులెటిన్ రావలసి ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు బుధవారానికల్లా మెడికల్ క్లియరెన్స్ పొందే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. కానీ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక అప్‌డేట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. బుమ్రా లభ్యతపై మ్యాచ్ ప్రారంభానికి ముందు మెడికల్ టీమ్ తుది నిర్ణయం తీసుకోనుంది.

టీమిండియా టీ20 స్క్వాడ్: 

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.