కేసీఆర్ ఫామ్‏హౌస్‎కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై BRS రాళ్ల దాడి

కేసీఆర్ ఫామ్‏హౌస్‎కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై BRS రాళ్ల దాడి

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని దామరకుంట దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‏పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలను నిరసిస్తూ యాదాద్రి జిల్లా నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‎హౌస్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‎పై బీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. 

దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, తీవ్ర ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల పోటాపోటీ నిరసనతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.

కేసీఆర్ ఫామ్‎హౌస్ దగ్గర ఉద్రిక్తత:

కేసీఆర్ ఫామ్‎హౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఎర్రవల్లిలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో కేసీఆర్ ఫామ్‎హౌస్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ అమలు చేసి ఫాంహౌస్‎కు వెళ్లే అన్నిరోడ్లు మూసివేశారు. ఫాంహౌస్ పరిసరాల్లోకి కూడా  పోలీసులు ఎవరినీ రానివ్వడం లేదు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ ఫామ్‎హౌస్‎కు బయలుదేరారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి నేరుగా ఫామ్ హౌస్‎కు వెళ్తున్నారు.