శ్రీశైలం ప్రాజెక్ట్‌.. జల విద్యుత్‌ ఉత్పత్తికే.. ఏపీకి తేల్చి చెప్పిన సీడబ్ల్యూసీ

శ్రీశైలం ప్రాజెక్ట్‌.. జల విద్యుత్‌ ఉత్పత్తికే.. ఏపీకి తేల్చి చెప్పిన సీడబ్ల్యూసీ

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మొట్టికాయలు వేసింది. శ్రీశైలంపై జలవిద్యుదుత్పత్తి ఆపాలని, ఏడు ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే పొరుగు రాష్ట్రం వాదనలను సీడబ్ల్యూసీ కొట్టిపారేసింది. శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని, ఏడు ప్రాజెక్టులకు అన్ని పరిశీలించాకే అనుమతులిచ్చామని ఏపీకి తేల్చి చెప్పింది.

సోమవారం ఢిల్లీలో జలవివాదాల కమిటీ సమావేశం నిర్వహించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్​నినో నేపథ్యంలో తెలంగాణ శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తితో నీటిని వృథా చేస్తున్నదని ఏపీ ఫిర్యాదు చేసింది. తమకు తాగునీటి అవసరాలున్నాయంటూ వాదించింది.

దానికి మన అధికారులు తీవ్రంగా స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యుదుత్పత్తి ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు శ్రీశైలం ప్రాజెక్టే జలవిద్యుత్ కోసం కట్టారని స్పష్టం చేశారు. తామేమీ నీటిని వృథా చేయడం లేదని చెప్పారు. తమకూ తాగునీటి అవసరాలున్నాయని, విద్యుదుత్పత్తిద్వారా సాగర్​కు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు తాగునీటిని తీసుకునే సోర్సు సాగరేనని, అక్కడి నుంచే హైదరాబాద్‌‌కు తాగునీటి కోసం ఏఎమ్మార్పీ ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల తాగునీటి అవసరాలనూ దాని ద్వారానే తీర్చుకుంటామని తెలిపారు. 

పోతిరెడ్డిపాడు నుంచి ఆపాలె.. 

అసలు నీటి విడుదలను నిలుపుదల చేయాల్సి వస్తే ముందుగా పోతిరెడ్డిపాడు నుంచే ఆపేయాలని మన అధికారులు తేల్చి చెప్పారు. పెన్నా బేసిన్‌‌లోని రిజర్వాయర్లలో ఇప్పటికే ఏపీ నీటిని నింపి పెట్టుకున్నదన్నారు. అవే 100 టీఎంసీల దాకా ఉంటాయని, అలాంటప్పుడు ఏపీకి ఇంకా తాగునీటికి ఎన్ని నీళ్లు కావాలని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ తీసుకుపోవాల్సింది కేవలం 34 టీఎంసీలేనని పేర్కొన్నారు. అందులో 19 టీఎంసీలు చెన్నై డ్రింకింగ్ వాటర్ కోసమైతే.. మరో 15 టీఎంసీలు ఏపీ తాగు, సాగునీటికన్నారు. ఇప్పటికే ఏపీ 34 టీఎంసీలకుపైగా మళ్లించేసిందని, శ్రీశైలంలో ఏపీకి చుక్క కూడా వాడుకునే హక్కులేదని, ఏపీ వాటా పూర్తయిపోయిందని స్పష్టం చేశారు.

పదేపదే అప్పటి తాత్కాలిక ఒప్పందాన్ని తెరపైకి తేవడం కరెక్ట్ కాదన్నారు. ప్రస్తుతం ఎల్​నినో పరిస్థితుల్లో ప్రాజెక్టుల్లో లోటు ఉందని, అలాంటప్పుడు ఆ పాత ఒప్పందం ప్రకారం నీళ్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ కూడా ఏపీ వాదనను తోసిపుచ్చింది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తిని ఆపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ప్రాజెక్ట్ స్కోప్ విద్యుదుత్పత్తి కోసమే కదా అని ఏపీకి స్పష్టం చేసింది.

ఆ ఏడు ప్రాజెక్టులపైనా ఏపీ ఫిర్యాదు..

మన రాష్ట్రంలోని ఏడు ప్రాజెక్టులపైనా ఏపీ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ సీతమ్మసాగర్ సీతారామసాగర్ ప్రాజెక్ట్, చౌటపల్లి హనుమంత రెడ్డి లిఫ్ట్, చిన్న కాళేశ్వరం, చనాకా కొరాట, మోడికుంటవాగు, గూడెం లిఫ్ట్​ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మళ్లీ డిమాండ్ చేసింది. అవన్నీ 2014 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులని పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వద్దంటూ డిమాండ్ చేసింది.

దీనిపైనా అధికారులు గట్టిగా బదులిచ్చారు. అవన్నీ ఉమ్మడి ఏపీలో మొదలుపెట్టిన ప్రాజెక్టులేనని తేల్చి చెప్పారు. అంతేగాకుండా 2009లో ఉమ్మడి ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర వంటి కరువు పీడిత రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి ఏఐబీపీ (యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్) కింద కేంద్రం హైపవర్ కమిటీ ప్రాజెక్టుల జాబితా ఇచ్చిందని గుర్తు చేశారు.

ఉమ్మడి ఏపీకి సంబంధించి 25 ప్రాజెక్టులను జాబితాలో పెడితే.. అందులో 22 ప్రాజెక్టులు తెలంగాణవేనని స్పష్టం చేశారు. వాటిలో ఏపీ చెబుతున్న ప్రాజెక్టులూ ఉన్నాయని, అలాంటప్పుడు అవి ఎందుకు కొత్త ప్రాజెక్టులవుతాయని నిలదీశారు. ఇటు సీడబ్ల్యూసీ కూడా ఏపీకి గట్టిగానే చురకలంటించింది. టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్సులు.. అన్ని అంశాలూ పరిశీలించాకే ఇచ్చామని స్పష్టం చేసింది.