- స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించడమే
- ఆయనను తక్షణమే హౌస్ నుంచి డిస్మిస్ చేయాలె
- మధు వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఫామ్‌హౌస్ కుట్రలు
- శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
హైదరాబాద్, వెలుగు: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యానికి, శాసన వ్యవస్థ గౌరవానికి తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించడమంటే యావత్ దళిత సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఇటీవల జరిగిన చర్చల ప్రభావమే బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యల్లో కనిపిస్తోందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను మంత్రి వివేక్ వెంకటస్వామి ఖండించారు. అసెంబ్లీని స్పీకర్ నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారని, బీఆర్‌ఎస్ సభ్యులకు కూడా తగిన సమయం ఇస్తున్నారని గుర్తుచేశారు. తాతా మధును వెంటనే పిలిచి హౌస్ ముందు వివరణ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దళితుల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్న విషయం ఆయన పాలనను చూస్తే అర్థమవుతుందన్నారు. రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం కూడా ఇందులో ఒకటని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను రాజకీయాలకే వాడుకున్నారని, ప్రస్తుతం పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తున్నారని మంత్రి అభినందించారు. పోలీసులపై బీఆర్ఎస్ నేతలే దాడులు చేసి, తిరిగి పోలీసులే దాడి చేసినట్టు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు బాధాకరం
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు బాధాకరమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే తాము వ్యతిరేకించబోమని, కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు.
దళితుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి గుర్తుచేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. దళితులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి అమలు చేయలేదని చెప్పారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల విషయంలోనూ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు మాత్రమే అయిందని, ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో చాలావరకు అమలుచేశామని, మిగిలిన హామీలను కూడా పూర్తిస్థాయిలో అమలుచేస్తామన్నారు. కానీ అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
