- జగదీశ్ రెడ్డిని కింద పడేసిన పోలీసులను
- సప్త సముద్రాల అవతలున్నా వదలమని వ్యాఖ్య
- అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే: హరీశ్ రావు
- మహిళా సభ్యుల చీరలు లాగిన పోలీసులను
- వదిలిపెట్టబోమని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీజురీయింబర్స్ మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా తమ గొంతు నొక్కారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి రాకుండా గెంటేశారని.. తమపై పోలీసులను ప్రయోగించారని, అమానుషంగా ప్రవర్తించారన్నారు.
ఇది తెలంగాణ అసెంబ్లీలో చరిత్రలో బ్లాక్ డే అని అన్నారు. ‘మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాసనసభనా.. లేదంటే కౌరవ సభా అని నిలదీశారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళా సభ్యుల చీరలు లాగిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
జగదీశ్ రెడ్డిని కిందపడేసిన పోలీసులను.. సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టబోమన్నారు. హోంమంత్రిగా, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తగిన మూల్యం తప్పించుకోక తప్పదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని 22ఏ మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద నామమాత్రపు చర్చ చేస్తారా? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా నల్ల టీ షర్ట్స్ వేసుకొని పార్లమెంట్ కు వెళ్లారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇక్కడ ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చ జరుపుతామంటే ఈ ప్రభుత్వం పారిపోయినట్లేనన్నారు. తమను సస్పెండ్ చేయడానికి ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా 22ఏ, ఫీజు రీయింబర్స్ మెంట్ వైఫల్యాల గురించి వదిలిపెట్టమన్నారు.
