నల్గొండ జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ రోగులు.. సరిపోని బెడ్లు.. 726 మంది పేషెంట్లకు 84 బెడ్స్

నల్గొండ జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ రోగులు.. సరిపోని బెడ్లు.. 726 మంది పేషెంట్లకు 84 బెడ్స్
  • నల్గొండ జిల్లాలో డయాలసిస్  బెడ్స్  సరిపోక పేషెంట్ల తిప్పలు 
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 సెంటర్లు ఉన్నా అవస్థలే

నల్గొండ, వెలుగు:ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కిడ్నీ బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. దానికి తగ్గట్లుగా సర్కారు దవాఖానల్లో డయాలసిస్  సేవలు అందడం లేదు. మారిన జీవనశైలి, కలుషిత నీరు, ఇతర ఆరోగ్య సమస్యలతో డయాలసిస్  చేయించుకోవాల్సిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు ఉన్నా, అక్కడ సరైన సౌలతులు లేకపోవడం, బెడ్ల కొరత వేధిస్తోంది.

11 సెంటర్లు ఉన్నా..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 11 డయాలసిస్  కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా 726 మంది రోగులకు నాలుగు షిఫ్టుల్లో ఉచితంగా డయాలసిస్  సేవలు అందిస్తున్నారు. అయితే, పేషెంట్ల సంఖ్యతో పోలిస్తే ఈ కేంద్రాల్లో ఉన్న బెడ్లు, డయాలసిస్  మెషీన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 

వారానికి రెండు లేదా మూడు సార్లు తప్పనిసరిగా డయాలసిస్  చేయించుకోవాల్సిన బాధితులు బెడ్లు దొరక్క గంటల తరబడి వెయిటింగ్  హాళ్లలో గడపాల్సి వస్తోంది. ప్రతి షిఫ్ట్​లో బెడ్లు ఖాళీ అయ్యేంత వరకు ఓపిక లేకపోయినా నరకయాతన అనుభవిస్తూ నిరీక్షిస్తున్నారు.

ప్రైవేట్​ దవాఖానల్లో దోపిడీ.. 

సర్కారు దవాఖానల్లో సమయానికి బెడ్లు దొరక్కపోవడం, వెయిటింగ్​ లిస్ట్​ ఎక్కువగా ఉండటంతో చాలా మంది రోగులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్  ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఒక్కో డయాలసిస్ సెషన్‌‌‌‌కు వేలాది రూపాయలు వసూలు చేస్తుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.

 ప్రైవేట్  రూమ్స్, మెడిసిన్స్, ల్యాబ్  టెస్టుల పేరుతో రోగుల నుంచి భారీగా డబ్బులు గుంజుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.

నాలుగు షిఫ్టులు నడుస్తున్నా సరిపోతలేవు

రోగుల రద్దీని తట్టుకోవడానికి కొన్ని కేంద్రాల్లో రోజంతా(నాలుగు షిఫ్టులు) డయాలసిస్  ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్‌‌‌‌కు సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. ఒక పేషెంట్‌‌‌‌కు డయాలసిస్  పూర్తి కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. ఈక్రమంలో తదుపరి షిఫ్ట్  రోగులు బయటే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రవాణా ఖర్చులు, వెయిటింగ్  భారంగా మారుతోంది.

హాస్పిటళ్ల వారీగా బెడ్ల వివరాలు..

నల్గొండ హాస్పిటల్​లో 15 మంది బెడ్లు ఉండగా, 135 మంది పేషెంట్లు, దేవరకొండలో 10 బెడ్లకు గాను, 50 మంది పేషెంట్లు, మిర్యాలగూడలో 10 బెడ్లు ఉండగా, 92 మంది, నాగార్జునసాగర్ లో 5 బెడ్లు ఉండగా, 40 మంది, మర్రిగూడలో 5 బెడ్లు ఉండగా, 30 మంది, సూర్యాపేటలో 7 బెడ్లు ఉండగా, 60 మంది, హుజూర్‌‌‌‌నగర్ లో 9 బెడ్లు ఉండగా, 80 మంది, కోదాడలో 5 బెడ్లు ఉండగా, 52 మంది, చౌటుప్పల్ లో 5 బెడ్లు ఉండగా, 50 మంది, భువనగిరిలో 8 బెడ్లు ఉండగా, 90 మంది, రామన్నపేటలో 5 బెడ్లు ఉండగా, 47 మంది డయాలసిస్​ చేయించుకుంటున్నారు.

బ్లడ్  ఇంజెక్షన్ల కొరతతో తిప్పలు

డయాలసిస్  పేషెంట్లకు ప్రతీ రెండు డయాలసిస్ లకు ఒక బ్లడ్  ఇంజెక్షన్  ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మూడు డయాలసిస్ లకు ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి తక్కువ సంఖ్యలో రావడంతో ఈ పరిస్థితి నెలకొందని టెక్నీషియన్లు చెబుతున్నారు. అదేవిధంగా ఐరన్  ఇంజెక్షన్లు కూడా అలాగే ఇస్తున్నారు. ఇక డయాలసిస్  పేషెంట్లకు నెఫ్రాల్జిస్ట్  అందుబాటులో ఉండడం లేదు. దీనివల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే డయాలసిస్  టెక్నీషియన్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
 
ఎదురుచూడాల్సి వస్తోంది

నాకు రెండేళ్లుగా కిడ్నీ సమస్య ఉంది. వారానికి రెండు సార్లు డయాలసిస్  చేయించుకోవాలి. సర్కారు దవాఖానకు వస్తే బెడ్  ఖాళీ లేదని గంటల తరబడి కూర్చోబెడుతున్నారు. ప్రైవేట్  హాస్పిటల్​కు వెళ్లేంత స్థోమత మాకు లేదు. ప్రభుత్వం వెంటనే బెడ్లు, మెషీన్ల సంఖ్య పెంచాలి. 

-మల్లికార్జున్, కోదాడ