ఉల్లి ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు..10 రోజుల్లో 4 వేల టన్నుల బఫర్ స్టాక్ విక్రయం

ఉల్లి ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు..10 రోజుల్లో 4 వేల టన్నుల బఫర్ స్టాక్ విక్రయం

న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న ఉల్లిపాయల ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సబ్సిడీ ధరలకు అమ్మకాలు ప్రారంభించిన తొలి పది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 17 నగరాల్లో సుమారు 4 వేల టన్నుల బఫర్ స్టాక్ ఉల్లిని విక్రయించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి నిధి ఖరే ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత ఏడాదికి కేంద్ర ప్రభుత్వం వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌‌సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా 1.21 లక్షల టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉంది.

ఉల్లి ఎక్కువగా పండే రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉండే ప్రాంతాలకు ‘కందా ఎక్స్‌‌ప్రెస్’ అనే ప్రత్యేక గూడ్స్ రైళ్లు, ట్రక్కుల ద్వారా వీటిని తరలిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్న నగరాల్లో కిలో రూ.35 సబ్సిడీ ధరకే విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, చెన్నై నగరాలకు భారీ ఎత్తున నిల్వలు చేరగా, త్వరలోనే గూవాహటికి కూడా సరఫరా చేయనున్నారు. అకాల వర్షాల వల్ల నిల్వ చేసిన రబీ పంట కొంత దెబ్బతిన్నప్పటికీ, ప్రభుత్వం నాణ్యమైన సరుకును మార్కెట్లోకి తెస్తోంది.

ఎన్‌‌సీసీఎఫ్ మాత్రమే ఇప్పటివరకు 1,500 టన్నుల ఉల్లిని విక్రయించిందని ఆ సంస్థ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. మొబైల్ వ్యాన్లు, సహకార సంఘాలు, రిటైల్ కేంద్రాల ద్వారా ఢిల్లీ-ఎన్‌‌సీఆర్, తమిళనాడు, యూపీ, కేరళ సహా పలు రాష్ట్రాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. కేంద్రం జోక్యంతో ధరలు కిలోపై రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గినప్పటికీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధర రూ.50.79గా ఉంది. సెప్టెంబర్ 5నాటికి కిలో ఉల్లి ధర ఢిల్లీలో రూ.58, ముంబైలో రూ.53, చెన్నైలో రూ.63గా పలికింది. అయితే అక్టోబర్ మధ్య నుంచి కొత్త ఖరీఫ్ పంట మార్కెట్లకు రానుండటంతో సరఫరా పెరిగి ధరలు మరింత తగ్గుముఖం పడతాయని అధికారులు భావిస్తున్నారు.